Sanjay Raut: సంజయ్‌ రౌత్‌కు షాకిచ్చిన ఈడీ

Shoot Me Or Send Me to Jail Iam Not scared Sanjay Raut After ED Attaches His Family Assets  - Sakshi

భూ కుంభకోణం కేసులో రూ.11.15 కోట్ల ఆస్తులు అటాచ్‌

మహారాష్ట్ర మధ్య తరగతిపై దాడి: సంజయ్‌ రౌత్‌

న్యూఢిల్లీ/ముంబై: భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గట్టి షాకిచ్చింది. సంజయ్‌ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. ముంబైలోని పత్రా చాల్‌ పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకల కేసులో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద రౌత్‌ భార్య వర్ష రౌత్, మరో నిందితుడు వ్యాపారవేత్త ప్రవీణ్‌ రౌత్, ఆయన భార్య స్వప్న పాట్కర్‌కు చెందిన ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్టు ఈడీ అధికారులు మంగళవారం ప్రకటించారు.

చదవండి: కాంగ్రెస్‌కు అహ్మద్‌ పటేల్‌ కుమారుడు షాక్‌!

అలీబాగ్‌లో ఎనిమిది స్థలాలు, దాదర్‌ శివార్లలో ఒక ఫ్లాట్‌ ఈడీ అటాచ్‌ చేసిన వాటిలో ఉన్నాయి. రూ.1,034 కోట్ల భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఫిబ్రవరిలో ప్రవీణ్‌ రౌత్‌ను అరెస్ట్‌ చేశారు. చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్‌పై సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. ఈడీని అడ్డం పెట్టుకొని మరాఠీ మధ్య తరగతిపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు ఈ విషయం గ్రహించాలన్నారు. ‘‘వీటికి బెదరను. లొంగిపోను. ఎంతవరకైనా ప్రతిఘటిస్తా’’ అని స్పష్టం చేశారు.

చదవండి: రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆస్తులూ అటాచ్‌
మనీ లాండరింగ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కి చెందిన రూ.4.81 కోట్లకు పైగా ఆస్తుల్ని కూడా అటాచ్‌ చేసినట్టు ఈడీ వెల్లడించింది. జైన్, ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్‌ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. జైన్‌ 2015–16లో ప్రభుత్వాధికారిగా ఉండగా ఆయన కుటుంబీకుల కంపెనీలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top