
న్యూ ఢిల్లీ: రోజురోజుకీ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని బైక్‌పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఈ అనుభవం ఓ మహిళా ఎంపీకి కూడా ఎదురైంది
కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధా రామకృష్ణన్ చైన్ దొంగతనానికి గురైంది. ఢిల్లీలో ఉదయం వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని గొలుసు దొంగలు కొట్టేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉదయం 6 గంటల సమయంలో ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో తోటి శాసనసభ్యడు, డీఎంకేకు చెందిన రాజాతితో కలిసి వాకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. దొంగ తనా మెడ నుంచి గొలుసును లాగడంతో, ఆమె మెడపై గాయాలయ్యాయని, తన చుడిదార్ కూడా చిరిగిపోయిందని ఫిర్యాదులో తెలిపారు.
అదే విధంగా ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. స్కూటర్‌పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసును లాక్కెళ్లాడని ఆమె పేర్కొన్నారు. కాగా సుధా రామకృష్ణన్ తమిళనాడులోని మైలదుత్తురై నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు.