బెంగళూరు: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు.
ఒకటో తరగతి చిన్నారి
ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్‌లెట్‌కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు.
ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది.


