సీఈసీ రాజీనామా చేయాల్సిందే! | CJP led a protest demanding CEC Gyanesh Kumar resignation | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాల్సిందే!

Oct 9 2026 5:39 AM | Updated on Oct 9 2026 5:39 AM

CJP led a protest demanding CEC Gyanesh Kumar resignation

బీజేపీని వ్యతిరేకుల ఓట్లు రద్దు చేయడానికే ‘సర్‌’ తీసుకొచ్చారు  

నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగాలని మోదీ భావిస్తున్నారు  

అభిజీత్‌ దీప్కే ధ్వజం  

ప్రకాశ్‌రాజ్, ధ్రువ్‌ రాఠీ హాజరు

బెంగళూరులో నిరసన సభ  

బెంగళూరు:  బీజేపీని వ్యతిరేకించే వారి ఓటు హక్కును రద్దు చేయడమే లక్ష్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)ను తీసుకొచ్చారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల సంఘం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఫ్రీడమ్‌ పార్కు వద్ద గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘పీపుల్స్‌ ట్రిబ్యూన్‌’పేరిట భారీ సభ నిర్వహించారు. 

ఈ నిరసన కార్యక్రమంలో అభిజీత్‌ దీప్కే, సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్, సీజేపీ నేతలు అశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్, సీనియర్‌ సాహితీవేత్త దేవనూరు మహాదేవ, ప్రముఖ ఆర్థిక నిపుణులు పరకాల ప్రభాకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల్‌గౌడ, యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌లో విచ్చలవిడిగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. 

సభకు మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ఎర్రర్‌ 404– నేమ్‌ నాట్‌ ఫౌండ్, అంతా అయిపోయింది బ్రో, రాజీనామా చేయండి సార్‌’అని రాసి ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. ‘మా పేర్లు తొలగించకండి, మా గొంతు వినండి’అని నినదించారు. నిరంకుశత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.   

బతికి ఉన్నామని నిరూపించుకోవడానికే..  
ఓటర్ల జాబితా నుంచి ఇష్టారాజ్యంగా ప్రజల పేర్లు తొలగించారని, తాము బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు. ఓట్లను తొలగించడం, దొంగిలించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. మరణించినట్లు ఎన్నికల సంఘం చెబుతున్న వ్యక్తులు ఇక్కడ సజీవంగా నిలబడి ఉన్నారని, సంభవించిన మరణం వీరిది కాదని, అది ఈ దేశ ప్రజాస్వామ్య మరణం అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల ఆదేశాల మేరకే ప్రజల ఓట్లను తొలగించారని ఆరోపించారు.   

‘నెక్ట్స్‌ వికెట్‌ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌’ 
మహాత్మా గాం«దీని భారతదేశపు ‘ఆత్మ’గా, అంబేడ్కర్‌ను ‘వెన్నెముక’గా, జవహర్‌లాల్‌ నెహ్రూను ‘మేధస్సు’గా అభిజీత్‌ దీప్కే అభివరి్ణంచారు. ఈ ముగ్గురు నేతలు భారతదేశ పునాదిని నిర్మించారని కొనియాడారు. నెహ్రూతో మోదీకి ఎంతమాత్రం పోలిక లేదన్నారు. ఓట్లను తొలగించడం ద్వారా నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగాలని మోదీ భావిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఓటు హక్కు సహా ఎన్నో హక్కులను కల్పించిన నెహ్రూ మేధస్సు చాలా గొప్పది అని ప్రశంసించారు. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’అనే నినాదం వెనుక ‘ఒక దేశం, ఒక పార్టీ’అనే విధానం ఉందని పేర్కొన్నారు.

 దీన్ని జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ విధానంతో పోల్చారు. బీజేపీకి మద్దతు ఇవ్వని వారి ఓట్లను తొలగించే నిర్ణయం తీసుకున్నారని అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. ‘ప్రజలు మాకు ఓటు వేయకపోతే, వారి ఓట్లనే తొలగిస్తాం’అనే ధోరణిని బీజేపీ అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ నాయకులను పూర్తిగా బలహీనపర్చడమే దీని వెను క ఉన్న అసలు వ్యూహమని మండిపడ్డారు. తమ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని, ఇక తమ ‘నెక్ట్స్‌ వికెట్‌ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌’అని దీప్కే తేల్చిచెప్పారు.  

పౌరుల గౌరవం, హక్కులపై దాడి: ప్రకాశ్‌ రాజ్‌  
ఎస్‌ఐఆర్‌ అనేది ఓట్ల తొలగింపునకు సంబంధించినది మాత్రమే కాదని.. అది పౌరుల గౌరవం, హక్కులపై దాడి ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపించారు. మోదీ, అమిత్‌ షాల ఆదేశాల మేరకే జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ పోరాటం కేవలం జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోసం మాత్రమే కాదన్నారు. 

ఆయన వెళ్లిపోయినా మరో అజ్ఞానేశ్‌ కుమార్‌ రావొచ్చని చెప్పారు. కాబట్టి ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ముసుగులో గిరిజనులు, పేదలు, ముస్లింలు, ఇతర మైనారిటీల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని దుయ్యబట్టారు. ప్రజలు తమ ఓట్లను తిరిగి పొందడానికి పోరాడాల్సిన పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా ఓట్లను తొలగించడానికి వారెవరు?’అని ప్రశ్నించారు. ‘ఓటు చోర్, గద్దీ చోర్‌’అని ప్రకాశ్‌ రాజ్‌ నినదించారు.  

ఓట్ల దొంగలు పదవుల నుంచి తప్పుకోవాలి: ధ్రువ్‌ రాఠీ  
ఎస్‌ఐఆర్‌ విషయంలో ఎన్నికల సంఘం నుంచి పారదర్శకత, జవాబుదారీతనం ఏమాత్రం లేవని యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. తాను ఒక సాధారణ పౌరుడిగానే ఈ ఆందోళనలో పాల్గొన్నానని తెలిపారు. ప్రభుత్వ మార్పు కోసం తాను ఇక్కడికి రాలేదన్నారు. 

ఎలాన్‌ మస్క్‌ గానీ, జార్జ్‌ సోరోస్‌ గానీ తనకు నిధులు సమకూర్చలేదని వివరణ ఇచ్చారు. తన సొంత డబ్బుతోనే ఇక్కడికి వచ్చానని స్పష్టంచేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ‘ఓట్ల చోరీ’అనేది ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని ఉద్ఘాటించారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని భావిస్తే, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి తప్పుకోవాలని తేల్చిచెప్పారు. నిరసనలో పాల్గొన్న వారిని దేశభక్తులుగా ధ్రువ్‌ రాఠీ అభివరి్ణంచారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను సమర్థిస్తున్న వారు దేశద్రోహులేనని విమర్శించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement