
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.
గురువారం మధ్యాహ్నాం క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.
‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.
జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు.
విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు.