
న్యూఢిల్లీ: కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మరో ఏడుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మాలిక్‌తోపాటు అతని అనుచరులు వీరేందర్ రానా, కన్వర్‌సింగ్ రానాలపై మూడేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్‌ను స్పెషల్‌కోర్టుకు సమర్పించింది.
చీనాబ్‌వాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్.బాబు, డైరెక్టర్లు అరుణ్‌కుమార్ మిశ్రా, ఎం.కె.మిట్టల్, పటేల్ ఇంజనీరింగ్ సంస్థ మేనేజిగ్ డైరెక్టర్ రుపేన్ పటేల్, మరోవ్యక్తి కన్వల్‌జీత్ సింగ్‌దుగ్గల్ పేర్లను కూడా చేర్చింది. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్, నా సహాయకుడిని కూడా అనవసరంగా వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను’’ అని ఎక్స్ వేదికగా మాలిక్ గురువారం పోస్ట్ చేశారు.