కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం!  | Cannot interfere in Collegium decisions says Supreme Court | Sakshi
Sakshi News home page

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

Jun 23 2026 5:39 AM | Updated on Jun 23 2026 5:39 AM

Cannot interfere in Collegium decisions says Supreme Court

కొత్త వివాదాలకు తెరతీయబోం 

పదోన్నతికి సీనియారిటీ ఒక్కటే ప్రామాణికం కాదు 

హిమాచల్‌ జడ్జి పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన జడ్జిగా పదోన్నతి పొందడం హక్కుగా మారదని తేల్చిచెప్పింది. తనకంటే జూనియర్లకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 

అసలేం జరిగిందంటే... 
హైకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు కొలీజియం జూన్‌ 2వ తేదీన న్యాయాధికారులు చిరాగ్‌భాను సింగ్, భూపేశ్‌ శర్మ, యోగేశ్‌ జస్వాల్‌లను హిమాచల్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేసింది. అయితే, వీరు ముగ్గురూ తన కంటే జూనియర్లని ధర్మశాల ఫ్యామిలీ కోర్టులో ప్రిన్సిపల్‌ జడ్జిగా పనిచేస్తున్న అరవింద్‌ మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురినీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. 
పిటిషనర్‌ వాదన ఇదీ..  

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అరవింద్‌ మల్హోత్రా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించాలని గతంలో సుప్రీంకోర్టు, హిమాచల్‌ హైకోర్టు కొలీజియంను కోరిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే, ఆ పునఃసమీక్ష జరగలేదని, పైగా ఆయన కంటే జూనియర్లను హైకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఇది ఆయన హక్కులను హరించడమేనని కోర్టుకు విన్నవించారు.

తుది తీర్పు.. పిటిషన్‌ కొట్టివేత 
సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పటికే హైకోర్టు సిఫార్సులను ఆమోదించినందున, దాన్ని ఇప్పుడు న్యాయసమీక్షకు గురిచేయలేమని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎలాంటి విధానపరమైన లోపం తమకు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే పిటిషన్‌ను ఉపసంహరించుకుని, హైకోర్టులోని సంబంధిత అధికారులకు పరిపాలనా పరంగా వినతిపత్రం సమరి్పంచుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది. ధర్మాసనం సూచన మేరకు పిటిషనర్‌ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో, కేసును కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.  

ధర్మాసనం ఏమన్నదంటే..  
ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన పదోన్నతికి అర్హత లభించదని స్పష్టం చేసింది. కొలీజియం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సులు చేసిన తర్వాత, కోర్టులు ఆ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేవని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కొంత గోప్యత కూడా ఉంటుందని గుర్తు చేసింది. కొలీజియం నిర్ణయాలపై విచారణ జరిపి కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు ఇంకా పదేళ్ల సరీ్వసు ఉన్నందున ఓపిక పట్టాలని, భవిష్యత్తులో అవకాశం రావొచ్చని సూచించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement