
మాంట్రియల్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చినట్లు కెనడా అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి ఎంతమాత్రం స్థానం లేదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నిస్తే సహించబోమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గతవారం కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు.
భారత్–కెనడా మధ్య సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభించాలని, ఉగ్రవాదం, సీమాంతర నేరాలపై ఉమ్మడి పోరాటం సాగించాలని వారిద్దరూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కెనడా ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేయడం గమనార్హం. దీనివల్ల ఆ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి, ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కెనడా మంత్రి గారీ ఆనంద సంగారీ చెప్పారు. కెనడాలో అధికారిక గణాంకాల ప్రకారం 88 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.
ఇందులో బిష్ణోయ్ గ్యాంగ్‌ను కూడా చేర్చారు. ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చితే వాటి ఆస్తులను, డబ్బును, వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. ఇండియన్ గ్యాంగ్‌స్టర్ బాలకరణ్ బ్రార్ అలియాస్ లారెన్స్ బిష్ణోయ్ తన పేరిటే గ్యాంగ్ ఏర్పాటు చేశారు. ఇండియాతోపాటు కెనడాలో పలు నేరాల్లో అతడి హస్తం ఉందని గుర్తించారు. హత్య, కాల్పులు, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలు వచ్చాయి.