Bombay High Court Denies Minor Girl Permission to Abort - Sakshi
Sakshi News home page

ఆ మైనర్‌ అమాయకురాలేం కాదు

Aug 1 2023 5:04 AM | Updated on Aug 1 2023 5:11 PM

Bombay High court denies minor girl permission to abort - Sakshi

ముంబై: గత సంవత్సరం డిసెంబర్‌ నుంచి ఒక అబ్బాయితో శారీరక బంధం కొనసాగిస్తున్న ఈ మైనర్‌ బాలిక అమాయకురాలేం కాదని బాంబే హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ సమ్మతి శృంగారంతోనే ఈ టీనేజీ అమ్మాయి గర్భం దాల్చింది. నిజంగా∙ఈ 17 ఏళ్ల బాలికకు గర్భం ఇష్టంలేదని భావిస్తే గర్భంవచ్చిందని నిర్ధారించుకున్న వెంటనే గర్భవిచ్ఛిత్తి కోసం దరఖాస్తు చేసుకొని ఉండాల్సింది’ అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ 26వ తేదీన వెలువర్చిన ఉత్తర్వులో వ్యాఖ్యానించింది.

‘ఈమెకు ఈ నెలాఖరుకల్లా 18 ఏళ్లు నిండుతాయి. కొన్ని నెలలుగా ‘ఫ్రెండ్‌’తో అమ్మాయి శారీరక బంధం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వయంగా తనే ప్రెగ్నెన్సీ కిట్‌ తెచ్చుకుని పరీక్షించుకుంది. సంబంధిత కేసు వివరాలు పరిశీలిస్తే బాధిత మైనర్‌ అమాయకురాలేం కాదని అర్థమవుతోంది’ అని జస్టిస్‌ రవీంద్ర, జస్టిస్‌ వైజీ ఖోబ్రగడేల బెంచ్‌ అభిప్రాయపడింది. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెన్‌(పోక్సో) చట్ట నిబంధనల ప్రకారం చూస్తే తాను చైల్డ్‌నని, గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వాలంటూ తల్లి ద్వారా ఈ అమ్మాయి హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

‘వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి చట్టం’ ప్రకారం 20 వారాలుదాటిన సందర్భాల్లో గర్భవిచ్ఛిత్తికి అనుమతి తప్పనిసరి. ప్రాణానికి హాని, తల్లి లేదా బిడ్డ ఆరోగ్యం విషమంగా మారొచ్చనే సందర్భాల్లోనే గర్భవిచ్ఛిత్తికి అనుమతిని ఇస్తారు. ‘ మరో 15 వారాల్లో డెలివరీ అనగా ఇప్పుడు గర్భవిచ్ఛిత్తి చేసినా బిడ్డ ప్రాణాలతోనే జన్మిస్తుంది. కానీ బ్రతికే అవకాశాలు తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో అబార్షన్‌కు అనుమతి ఇవ్వబోం. పుట్టాక ఎవరికైనా దత్తత ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement