pregnancy test
-
బిడ్డ బాగానే ఉందా?
నాకు 26 సంవత్సరాలు. మా పెళ్లై ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడు నాకు రెండు నెలల గర్భం ఉంది. ఇది నా మొదటి గర్భధారణ. ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు గతంలో లేవు. కాని, నా కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉందా, ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా అని కొంచెం ఆందోళనగా ఉంది. ఇలాంటి సమయంలో ఏయే పరీక్షలు చేయించుకోవాలి? – స్వప్న, తిరుపతి.ఒక ప్రైమీ పేషెంట్, అంటే మొదటిసారి గర్భం దాల్చిన మహిళ, మీకు మొదటగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఐదు నుంచి ఆరు వారాల సమయంలో ఒక స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ ద్వారా గర్భసంచిలో జెస్టేషనల్ సాక్ సరైన స్థానంలో ఉందా లేదా అన్నది చెక్ చేస్తాము. అంటే గర్భం గర్భసంచిలోనే సరిగ్గా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటాము. దాని తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది వారాల సమయంలో మళ్లీ ఒకసారి స్కాన్ చేస్తాము. దీనిని వయబిలిటీ స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ హార్ట్‌బీట్ సరిగ్గా ఉందా, ఎదుగుదల ఎలా జరుగుతోంది అన్నది చెక్ చేస్తాము. హార్ట్‌బీట్, ఎదుగుదల సరిగ్గా ఉంటే తగిన ఫోలిక్ యాసిడ్ వంటి మందులు ఇచ్చి గర్భధారణను కొనసాగిస్తాము. తర్వాత 11 నుంచి 14 వారాల మధ్య, అంటే దాదాపు మూడు నెలల సమయంలో ఒక ప్రత్యేక స్కాన్, రక్తపరీక్ష చేస్తాము. దీనిని మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటారు. ఇందులో బిడ్డలో ముఖ్యమైన అవయవాల నిర్మాణం ఎలా ఉందో స్కాన్ ద్వారా పరిశీలించి, రక్తపరీక్ష ఫలితాలతో కలిపి కొన్ని జన్యు సమస్యల ప్రమాదం ఎంత ఉందో అంచనా వేస్తాము. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ వంటి సాధారణ జన్యు సమస్యల రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల్లో రిస్క్ తక్కువగా ఉంటే గర్భధారణను సాధారణంగా కొనసాగిస్తాము. తర్వాత ఐదో నెలలో ఒక ముఖ్యమైన స్కాన్ చేస్తాము. దీనిని టిఫా స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలిస్తాము. టిఫా స్కాన్ లో కూడా ఎలాంటి సమస్యలు కనిపించకపోతే ఎక్కువగా ఇది ఆరోగ్యకరమైన గర్భధారణగా భావిస్తాము. కానీ మొదటి త్రైమాసిక పరీక్షల్లో రిస్క్ కొంచెం ఎక్కువగా లేదా మధ్యస్థంగా కనిపిస్తే, తదుపరి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మరింత కచ్చితమైన రక్తపరీక్షలు లేదా అవసరమైతే ఉమ్మనీరు పరీక్ష చేసి బిడ్డలో జన్యు సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే టిఫా స్కాన్ లో ఏదైనా మార్పులు కనిపిస్తే, ఉదాహరణకు మెదడు లేదా గుండె అభివృద్ధిలో ఏదైనా తేడా ఉంటే, దానికి అనుగుణంగా ప్రత్యేక పరీక్షలు చేయవచ్చు. ఉదాహరణకు బిడ్డ గుండె పనితీరును తెలుసుకోవడానికి ప్రత్యేక హార్ట్ స్కాన్ లేదా మెదడు అభివృద్ధిని చూడటానికి మరింత వివరమైన స్కాన్ చేయవచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా జన్యు సమస్యలు ఉన్నాయా లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగిందా అన్నది కూడా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా రిస్క్ ఎంత ఉందో అంచనా వేసి, అవసరమైన పరీక్షలు చేయవచ్చు. సాధారణంగా ఈ అన్ని పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ వెళ్తే గర్భధారణ సురక్షితంగా కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. అన్ని పరీక్షలు సాధారణంగా ఉంటే ఎక్కువగా గర్భధారణ ఆరోగ్యకరంగానే కొనసాగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
ఆ మైనర్ అమాయకురాలేం కాదు
ముంబై: గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఒక అబ్బాయితో శారీరక బంధం కొనసాగిస్తున్న ఈ మైనర్ బాలిక అమాయకురాలేం కాదని బాంబే హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ సమ్మతి శృంగారంతోనే ఈ టీనేజీ అమ్మాయి గర్భం దాల్చింది. నిజంగా∙ఈ 17 ఏళ్ల బాలికకు గర్భం ఇష్టంలేదని భావిస్తే గర్భంవచ్చిందని నిర్ధారించుకున్న వెంటనే గర్భవిచ్ఛిత్తి కోసం దరఖాస్తు చేసుకొని ఉండాల్సింది’ అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ 26వ తేదీన వెలువర్చిన ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. ‘ఈమెకు ఈ నెలాఖరుకల్లా 18 ఏళ్లు నిండుతాయి. కొన్ని నెలలుగా ‘ఫ్రెండ్’తో అమ్మాయి శారీరక బంధం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వయంగా తనే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని పరీక్షించుకుంది. సంబంధిత కేసు వివరాలు పరిశీలిస్తే బాధిత మైనర్ అమాయకురాలేం కాదని అర్థమవుతోంది’ అని జస్టిస్ రవీంద్ర, జస్టిస్ వైజీ ఖోబ్రగడేల బెంచ్ అభిప్రాయపడింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్(పోక్సో) చట్ట నిబంధనల ప్రకారం చూస్తే తాను చైల్డ్నని, గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వాలంటూ తల్లి ద్వారా ఈ అమ్మాయి హైకోర్టులో పిటిషన్ వేసింది. ‘వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి చట్టం’ ప్రకారం 20 వారాలుదాటిన సందర్భాల్లో గర్భవిచ్ఛిత్తికి అనుమతి తప్పనిసరి. ప్రాణానికి హాని, తల్లి లేదా బిడ్డ ఆరోగ్యం విషమంగా మారొచ్చనే సందర్భాల్లోనే గర్భవిచ్ఛిత్తికి అనుమతిని ఇస్తారు. ‘ మరో 15 వారాల్లో డెలివరీ అనగా ఇప్పుడు గర్భవిచ్ఛిత్తి చేసినా బిడ్డ ప్రాణాలతోనే జన్మిస్తుంది. కానీ బ్రతికే అవకాశాలు తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో అబార్షన్‌కు అనుమతి ఇవ్వబోం. పుట్టాక ఎవరికైనా దత్తత ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
హాస్టల్లో దారుణం.. గర్భం దాల్చిన విద్యార్థినులు!
సాక్షి, కొమురం భీం జిల్లా : అసిఫాబాద్‌లో ట్రైబల్ మహిళా డిగ్రీ కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంటల్ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ సిబ్బంది వారిని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. పదిమందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటీవ్ వచ్చిందని తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి ఒకరే గర్భం దాల్చారని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా కూడా..సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'మైనర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు చేయలేదు'
న్యూఢిల్లీ: మహిళా మైనర్ బాక్సర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వచ్చిన వార్తలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) తోసిపుచ్చింది. ప్రపంచ చాంఫియన్ షిప్ లో పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. తాము ఎంపిక చేసిన బృందంలో 18 ఏళ్ల లోపు వారు ఎవరూ లేరని, వరల్డ్ కప్ లో పాల్గొనడానికి కనీస వయసు 19 ఏళ్లు అని సాయ్ డైరెక్టర్ జనరల్ జిజీ థామ్సన్ తెలిపారు. ఇలాంటప్పుడు మైనర్లకు పరీక్షలు నిర్వహించడమన్న ప్రశ్న ఎక్కడిదని ఆయన అన్నారు. 1994లో జన్మించిన యువతే తాము ఎంపిక చేసిన బృందంలో పిన్నవయస్కురాలని వెల్లడించారు.


