
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని 50 కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఏ పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయో స్పష్టంగా తెలియకపోయినా, వాటిలో మాలవీయ నగర్, నజాఫ్‌గఢ్‌లోని పాఠశాలలు ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలోని సర్వోదయ కన్యా విద్యాలయ (ఎస్‌కేవీ)కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ , భద్రతా సిబ్బంది పాఠశాలకు చేరుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నగరంలోని 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడాన్ని మరచిపోకముందే, తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.
గడచిన సోమవారం నగరంలో 32 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలలకు చేరుకుని, తమ పిల్లలను ఇంటికీ తీసుకెళ్లారు. తాజాగా పాఠశాలలకు తిరిగి బాంబు బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారని, ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయిని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.