సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ కార్యక్రమానికి హాజరు
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే ఆయన హైదరాబాద్‌కు వస్తారని, అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు వెళ్లి సైనిక్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడంతోపాటు అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తా పటా్నయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.


