కడెం–గోదావరి సంగమస్థలిలో గుర్తింపు
పురాతన విగ్రహాలు సైతం లభ్యం
కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామం సమీపంలో గోదావరి, కడెం నది సంగమ ప్రాంతం ప్రవాహ మధ్య తీరంలో ఒక అరుదైన శిలాశాసనాన్ని చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ గుర్తించారు. తెలుగు, కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని పరిశీలించిన ఆయన, 11వ శతాబ్దపు కాకతీయ పరిపాలన కాలంనాటిది అయి ఉంటుందని తెలిపారు.
శాసనంలోని కొన్ని పదాలు కడెం–గోదావరి సంగమానికి సంబంధించినవిగా వివరించారు. అయితే ఇది పూర్తి శాసనం కాదని, ఇతర ప్రదేశంలో వేరే పరుపు బండలపై మిగతా శాసన భాగాలు ఉండి ఉండవచ్చని తెలిపారు. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గితే వాటిని గుర్తించవచ్చని వెల్లడించారు.
పురాతన విగ్రహాలు కూడా..
శాసనం లభ్యమైన నదీ జలాల్లో రాష్ట్రకూటశైలి కాలానికి (క్రీ.శ.సుమారు పదో శతాబ్దం) చెందిన మహిషాసుర మర్ధిని విగ్రహం, కాకతీయ కాలానికి చెందిన (క్రీ.శ.11లో శతాబ్దపు)గణపతి విగ్రహం, మలికాకతీయ కాలానికి(13వ శతాబ్దం)చెందిన మహిళా దేవత విగ్రహం విరిగిన భాగాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతపు తీరభాగంలో రాష్ట్ర కూటుల కాలానికే చెందిన దేవాలయ స్తంభాలు కనిపించాయి. దీంతో ఈప్రాంతం రాష్ట్ర కూటుల పాలనలో, కాకతీయుల పాలనలోనూ భాగమై ఉండేదని తెలుస్తోంది.
గోదావరికి ఆవతల ఉన్న కొండ క్వారీ నుంచి ఆ కాలంలో భారీ ఎత్తున దేవాలయానికి అవసరమైన విడిభాగాలను తీరంపై ప్రాంతానికి తరలించినట్లు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో యువ పరిశోధకుడు రాజశేఖర్ పాలుపంచుకున్నారు.
అరుదైన జలాధి శాసనమిది
ఇంతవరకు నదుల సంగమం వద్ద ఇలాంటి శాసనాలు ఎక్కడా లభించలేదు. అరుదైన జలాధి శాసనమిది. ముందు తరాలు గతాన్ని తెలుసుకునేందుకు అప్పటి చరిత్రే మూలం. పురాతన ఆలయాలు, విగ్రహాల పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రభుత్వం వీటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. – కరిపె రాజ్‌కుమార్, చరిత్ర పరిశోధకుడు


