రోజూ 30 సె.మీ.ల మేర ప్రాజెక్టు నీటిమట్టం తగ్గింపు
నిల్వలు 517.8 మీటర్లకు చేరే వరకు...
జలాశయాన్ని తనిఖీ చేసిన టెక్నికల్ కమిటీ నిర్ణయం
ఆ తర్వాత మరోసారి తనిఖీ చేసి పూర్తిగా ఖాళీ చేసే అంశంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నిర్వహణలో భాగంగా డిసెంబర్ 1 నుంచి క్రమంగా జలాశయాన్ని ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జలాశయ గరిష్ట నీటిమట్టం 526.3 మీటర్లు కాగా ప్రస్తుతం 520.49 మీటర్ల మేర నిల్వలు ఉన్నాయి. జలాశయాన్ని ఒకేసారి ఖాళీ చేయకుండా రోజుకి 30 సె.మీ.ల మేర ఖాళీ చేయనున్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుసేన్ నేతృత్వంలో ఏర్పాటైన టెక్నికల్ కమిటీ శనివారం ప్రాజెక్టును తనిఖీ చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జలాశయంలో నిల్వలు 517.8 మీటర్లకు చేరే వరకు జలాశయాన్ని ఖాళీ చేశాక, మరోసారి తనిఖీ చేసి తదుపరి ఏ స్థాయి వరకు ఖాళీ చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీటి సరఫరాకు ఉన్న అవకాశాలను పరిశీలించి సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఈ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది.
వేసవి తాగునీటి అవసరాలకు జలాశయంలో కొంత మేరకు నీటిని నిల్వ చేసి మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం ఉందా? లేక మరమ్మతుల కోసం జలాశయాన్ని పూర్తిగా (క్రెస్ట్ లెవల్) ఖాళీ చేయాల్సిందేనా? అనే అంశంపై ఈ టెక్నికల్ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
జలాశయానికి మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశముందని ఇటీవల డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్‌పీ) తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం మరమ్మతులకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలలోనే మరమ్మతు పనులను ప్రారంభించేందుకు నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది.
మరమ్మతులు చేస్తే 50 ఏళ్లు ఢోకా ఉండదు
జలాశయాన్ని ఖాళీ చేస్తే దాని కింద ఉన్న 40 వేల ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటిస్తారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించి, 2026 జూలై నాటికి పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. పనులు పూర్తికాకుంటే ఆ తర్వాతి వానాకాలం సీజన్‌లో సైతం పంటలకు క్రాప్ హాలీడే ప్రకటిస్తారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 29.91 టీఎంసీల సామర్థ్యంతో 1976లో సింగూరు జలాశయ నిర్మాణం ప్రారంభించగా, 1980లో పూర్తయింది.
జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్‌స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తోపాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలాచోట్లలో అప్‌స్ట్రీమ్ స్లోప్‌కు రక్షణగా ఉండే రివిట్‌మెంట్ దెబ్బతిన్నది. ఒరిజినల్ డిజైన్ల ప్రకారం జలాశయంలో నిల్వలు 517.8 మీటర్లకు మించకుండా చూడాలి. మిషన్ భగీరథ అవసరాలకు 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను కొనసాగించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 885 జారీ చేసింది.
దీంతో కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతిన్నది. ఏ క్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేసే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టంతో పాటు జలాశయానికి తీరని నష్టం జరగనుంది.
సింగూరు జలాశయానికి దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్‌డ్యామ్‌లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరుగుతుందని డీఎస్‌ఆర్పీ తన నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒక సీజన్‌లో క్రాప్‌హాలిడే ప్రకటించి మరమ్మతులు నిర్వహిస్తే వచ్చే 50 ఏళ్లలో జలాశయానికి ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు అంటున్నారు.


