ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్–ఢిల్లీ మధ్య నడిచిన సంపర్క్ రైలు
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తరలిన ఈ రైలు
నాటి నుంచి తెలంగాణవాసులకు పెరిగిన బెర్తుల కొరత
ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఈ రైలు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్వరలో మార్గం సుగమం కానుంది. ప్రస్తుతం రైల్వేబోర్డు పరిశీలనలో ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌కు సుమారు మూడు నెలల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత వెసులుబాటు లభించనుంది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడం వల్ల ఢిల్లీ ప్రయాణం ప్రయాణికులకు భారంగా మారింది.
రాజకీయ వర్గాలు మొదలుకొని సాధారణ ప్రయాణికుల వరకు విమానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరో రైలు సదుపాయం అందుబాటులోకి వస్తే ప్రయాణ భారం తగ్గనుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రైళ్లు పట్టాలెక్కితే హైదరాబాద్–ఢిల్లీ మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఏపీకి తరలిన సంపర్క్ క్రాంతి...
దేశ రాజధాని నుంచి రాష్ట్ర రాజధానులను అనుసంధానిస్తూ ఒక్కో సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నడిచిన ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తరలిపోయింది. దీంతో తెలంగాణకు ప్రత్యేకంగా సంపర్క్‌క్రాంతి లేదు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రం రెగ్యులర్‌గా నడుస్తున్నాయి.
ఇవి కాకుండా ఏపీ సంపర్క్ క్రాంతి వారానికి 3 రోజులు, కర్ణాటక సంపర్క్‌క్రాంతి వారానికి 5 రోజుల చొప్పున కాచిగూడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఈ రైళ్లు ప్రారంభ స్టేషన్లలోనే పూర్తిగా నిండిపోయి రావడం వల్ల హైదరాబాద్ ప్రయాణికులకు బెర్తులు లభించడం కష్టంగా మారింది. మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకరోజే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి నడుస్తోంది.
అలాగే దురంతో వారానికి 2 రోజులు, తిరుపతి నుంచి జమ్ముతావి వరకు వెళ్లే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వంటివి కాచిగూడ మీదుగా రాకపోకలు సాగిస్తున్నా ఆయా రాష్ట్రా ల్లోనే భారీ డిమాండ్‌తో బయలుదేరడం వల్ల హైదరాబాద్ ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు.
తెలంగాణ సంపర్క్‌క్రాంతితో ఊరట....
తెలంగాణ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. వివిధ స్థాయిల్లో సకాలంలో ఆమోదం ల భిస్తే మూడు నెలల్లోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకా శం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడున్న రైళ్లు కా జీపేట మీదుగా నడుస్తుండగా కొత్తగా ప్రవేశపెట్టనున్న సంపర్క్ క్రాంతి రైలును సికింద్రాబాద్–నిజామాబాద్–పెద్దప ల్లి మార్గంలో ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇందుకు బోర్డు అంగీకరిస్తే 130 కిలోమీటర్ల దూరం ఎ క్కువైనప్పటికీ ఈ మార్గంలోని మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ప్రయాణికులకు ఢిల్లీతో అనుసంధానం ఏర్పడుతుంది. పైగా దీనివల్ల తెలంగాణలోని అన్ని ప్రాంతాలు ఢిల్లీతో అనుసంధానమైనట్లవుతుంది.
2018 నుంచి పోరాడుతున్నాం..
సికింద్రాబాద్–పెద్దపల్లి రూట్‌లో తెలంగాణ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని 2018 నుంచి పోరాడుతున్నాం. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడిపితే ప్రయాణికులకు చాలా వరకు ఇబ్బందులు తొలగుతాయి. – ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధి


