న్యూఢిల్లీ సాక్షి, దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ కోర్టులో బాంబు పెట్టామంటూ మెయిల్ సందేశం వచ్చింది. దానితో పాటు పటియాలా హౌస్ కోర్టు, సాకేట్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు భవనాలను ఖాళీ చేయించారు. అక్కడ ఉన్న వారందరినీ హుటాహుటీన ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్స్ తో పాటు ఇతర ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.
ఇటీవలే ఎర్రకోట బాంబుపేలుళ్లతో అట్టుడికిపోయిన దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. నగరంలోని మూడు కోర్టులతో పాటు ద్వారకా, ప్రశాంత్ విహార్ లలో ఉన్న సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రదేశాలని ఖాళీ చేయించారు. ప్రత్యేక బృందాలతో సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్రలు పన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ బృందాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొవడంతో పాటు ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంతలోనే ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.


