సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకమాండ్‌ వార్నింగ్‌ | BJP Minister Vijay Shah Controversial Comments On Colonel Sofiya Qureshi, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Sophia Qureshi: సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకమాండ్‌ వార్నింగ్‌

May 14 2025 9:44 AM | Updated on May 14 2025 10:38 AM

BJP Minister Vijay Shah Comments On Colonel Sofiya Qureshi

భోపాల్‌: భారత సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని.. ఉగ్రవాదులను హతమార్చేందుకు పంపించి మోదీ గుణపాఠం చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్‌పై పోరులో భాగంగా ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీ విజయ్‌ షా ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అని వ్యాఖ్యలు చేశారు.

దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. అనంతరం, మధ్యప్రదేశ్‌ బీజేపీ హైకమాండ్‌.. విజయ్‌ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. దీంతో, మరోసారి స్పందిస్తూ.. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు.

మరోవైపు.. మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement