
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యల కేసు
మధ్యప్రదేశ్ మంత్రిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
బహిరంగ క్షమాపణ చెప్పనందుకు మండిపాటు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మధ్యప్రదేశ్ మంత్రి కువ్వర్ విజయ్ షా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుండా న్యాయస్థానం సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ తలంటింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రి ప్రవర్తనను, వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోందని పేర్కొంది.
‘ఈ విధంగా క్షమాపణ చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెబుతున్నాం. ఏది? ఎక్కడ చెప్పారు? మా సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నారు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రి షా చెప్పిన బహిరంగ క్షమాపణలను ఆన్‌లైన్‌లో షేర్ చేశామని ఆయన తరఫు లాయర్ కె.పరమేశ్వర్ తెలపగా.. ‘క్షమాపణలను ఆన్‌లైన్‌లో చెప్పడమేంటి? ఆయన తీరు, ఉద్దేశాలపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి.
క్షమాపణ చెప్పినట్లుగా రికార్డు చేయండి. మేం దాన్ని చూడాల్సి ఉంది’అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రి షా ప్రకటనలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆగస్ట్ 13వ తేదీలోగా నివేదికను తమకు అందజేయాలంది. ఈ సందర్భంగా సిట్ అధికారి ఒకరు 27 మంది ఇచ్చిన వాంగ్మూలాలను సీల్డ్ కవర్‌లో అందజేశారు. వీటిపై తాము దర్యాప్తు చేపట్టినట్లు ఆ అధికారి చెప్పారు.
షా ప్రకటనలు కాకుండా ఇదే విషయంలో ఇతరులు చేసిన అనుచిత ప్రకటనలను రికార్డు చేయాలని ధర్మాసనం సిట్‌ను ఆదేశించింది. కున్వర్ విజయ్ షాను మంత్రిపదవికి రాజీనామా చేయించాలంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. షా గతంలో చేసిన ఇటువంటి అనుచిత ప్రకటనలపైనా సిట్ దర్యాప్తు చేస్తుందని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వీరిపై మంత్రి కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.