నోరు పారేసుకున్న మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ | FIR registered against Minister Vijay Shah over remarks on Colonel Sofiya | Sakshi
Sakshi News home page

నోరు పారేసుకున్న మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌

May 15 2025 5:41 AM | Updated on May 15 2025 5:41 AM

FIR registered against Minister Vijay Shah over remarks on Colonel Sofiya

మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలపై రగడ 

ఉగ్రవాదుల సోదరి కల్నల్‌ సోఫియా ఖురేషీ అంటూ వ్యాఖ్యలు  

జబల్పూర్‌: పాకిస్తాన్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’గురించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, దేశ ప్రజలకు ఎప్పుకప్పుడు సమాచారం అందించిన మహిళా సైనికాధికారి, కల్నల్‌ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్‌ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ నేత విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

మహిళా అధికారిని కించపర్చేలా మాట్లాడిన విజయ్‌ షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. మంత్రి వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. బుధవారం సాయంత్రం 6 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఆ విషయం తమకు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను గురువారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది.  

అసలేమిటీ వివాదం?  
మంత్రి విజయ్‌ షా మంగళవారం ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్‌ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు. 

అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్‌ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పారీ్టలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

మంత్రివర్గం నుంచి తొలగించాలి
విజయ్‌ షాను తక్షణమే మధ్యప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయ్‌ షా వ్యాఖ్యలను బీజేపీ సీనియర్‌ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఆయనొక మూర్ఖుడు అని మండిపడ్డారు. బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడడం కొందరికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయ్‌ షా అభ్యంతకర వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఖండించారు.

 మహిళా అధికారి గురించి అలా మాట్లాడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కార్‌ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపర్చేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. యూనిఫాంలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులను గౌరవించాలని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ అనుచితంగా మాట్లాడడాన్ని సహించబోమని హెచ్చరించారు.  

పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం: విజయ్‌ షా  
తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతుండడంతో విజయ్‌ షా బుధవారం స్పందించారు. ఎవరైనా బాధపడి ఉంటే ఒకటి కాదు పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కల్నల్‌ సోఫియా ఖురేషిని తన సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement