తిరువనంతపురం: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సంచలనంగా మారింది. కేవలం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మొదలైన ఈ వేదికకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బీజేపీ భయపడుతోందని కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య నిరసనలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.
అసహనమే అధికార పక్షం ఆయుధమా?
యువ కార్యకర్త అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కొన్ని వేదికల్లో అధికార బీజేపీ కంటే ఈ సంస్థకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సీజేపీకి చెందిన ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయడం, చివరకు వ్యవస్థాపకుడు అభిజీత్ వ్యక్తిగత ఖాతాను కూడా సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నిరసనను అణచివేసే ప్రయత్నం
తమను ‘బొద్దింకలు’గా పిలుచుకుంటూ చేపట్టిన ఈ నిరసనను కేవలం ఒక సాధారణ స్పందనగా కొట్టిపారేయకూడదని పినరయి విజయన్ పేర్కొన్నారు. తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పందించిన ఆయన, కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిని ఎండగట్టారు. ఇలాంటి వ్యంగ్య రాజకీయ ప్రయోగాలను చూసి అధికార పక్షం కంగారు పడటం, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయ స్థాయికి ‘బొద్దింక’ పోరు
భారతదేశంలో మొదలైన ఈ ‘కాక్రోచ్’ ట్రెండ్ ఇప్పుడు సరిహద్దులు దాటుతోంది. ఈ సంస్థపై సైబర్ దాడులు, పోలీసు హెచ్చరికలు, విదేశీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నా, ప్రజాదరణ తగ్గడం లేదు. ముఖ్యంగా ఇలాంటి వినూత్న నిరసనలు భారత్ నుంచే కాకుండా పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కొత్త రాజకీయ కదలికలకు దారితీస్తుండటం విశేషం.


