రాజ్‌నాథ్‌ నివాసంలో రహస్య భేటీ? | BJP And RSS Leaders Secret Meeting At Rajnath Singh Home | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ నివాసంలో రహస్య భేటీ?

Jun 20 2026 7:14 AM | Updated on Jun 20 2026 11:24 AM

BJP And RSS Leaders Secret Meeting At Rajnath Singh Home

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పునకు తెరవెనుక భారీ కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో రహస్య భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలు హాజరయ్యారని తెలిసింది.

దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో రాబోయే ఎన్నికలు, ప్రభుత్వ పనితీరు, కీలక నియామకాలపై అధిష్టానం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ఈసారి భారీగానే మార్పులుంటాయనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు 40 శాతం వరకు మంత్రివర్గంలో మార్పులకు అవకాశం ఉందంటున్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేపట్టడంతోపాటు, కొందరికి ఉద్వాసన పలికే అవకాశముందని, కొత్త వారికీ చోటు కల్పిస్తారని సమాచారం. మంత్రుల పనితీరు, వయస్సు రీత్యా సమతుల్యత, ఎన్నికల్లో పార్టీకి చేకూరే లబ్ధి.. ఈ మూడు అంశాల ఆధారంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ తన ప్రాధాన్యతలను బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పాతవారికి కొన్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తూనే, కేబినెట్‌లోకి యువ రక్తాన్ని ఎక్కించేందుకు సంఘ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రాలపైనా కన్ను..
కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చడం ద్వారా కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తోంది. భావజాలం, పరిపాలనాపరంగా గట్టి పట్టున్న వారినే గవర్నర్లుగా నియమించేలా ఆర్‌ఎస్‌ఎస్‌ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ పదాధికారుల కమిటీలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement