
బీజేపీ, మిత్రపక్షాల మధ్య పొత్తులు కొలిక్కి
చర్చలు సానుకూలమన్న చిరాగ్ పాశ్వాన్
రేపు బీజేపీ ఎన్నికల కమిటీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై విస్తృత చర్చలు కొనసాగుతుండగానే ఏకాభిప్రాయం కుదిరిన స్థానాల్లో తొలి జాబితా విడుదల చేసేందుకు ఎన్‌డీయే పక్షాలు సిద్ధమవుతున్నాయి. అన్నీ కుదిరితే ఎన్‌డీయే పారీ్టలు ఈ నెల 13న తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతకుముందే బీజేపీ తన అభ్యర్థుల ఎంపిక కోసం శని, ఆదివారాల్లో కీలక భేటీలు జరుపనుంది.
బిహార్‌లోని 243 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూలు చెరో వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ ఆవామ్ మోర్చా కేటాయించాల్సిన సీట్లపై ఎటూ తేలలేదు. లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మొన్నటివరకు 40 స్థానాలను డిమాండ్ చేయగా, బీజేపీ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అనంతరం ఆయన కొద్దిగా మెత్తబడ్డట్లు తెలుస్తోంది.
35 సీట్లకు ఆయన దిగొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బీజేపీ ఆయన పార్టీకి 28–30 సీట్లు ఇచ్చేందుకు సుముఖత చూపుతోంది. ఇక చిరాగ్ పార్టీ పోటీ చేసే 20 స్థానాలపై స్పష్టత వచ్చిట్లు సమాచారం. హెచ్‌ఏఎంకు ఇవ్వాల్సిన 7 స్థానాలు, ఆర్‌ఎల్‌ఎంకి ఇవ్వనున్న మరో 6 స్థానాలపై ఇప్పటికే ఒక అంగీకారం కుదిరినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీజేపీ, జేడీయూలు పోటీ చేసే స్థానాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి.
సుమారు 80కి పైగా స్థానాల్లో స్పష్టత ఏర్పడింది. స్పష్టత ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల11న ఢిల్లీలో బీజేపీ బిహార్ కోర్ గ్రూప్ సమావేశం కానుంది,. మరుసటి రోజున పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ సమావేశాల తర్వాత అభ్యర్థుల జాబితాకు తుది ఆమోదం లభిస్తుందని, అక్టోబర్ 13న తొలి ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 స్థానాలను గెలుచుకుంది. ఇందులో 9మంది మహిళలు ఉన్నారు. ఈసారి కూడా 8–10 సిట్టింగ్ స్థానాలు మినహా మిగతావి పాతవారికే ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.