ఇంట్లోకి చొరబడండి! | Asaduddin Owaisi Sensational Statement On Pakistan Occupied Kashmir, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి చొరబడండి!

May 2 2025 2:34 AM | Updated on May 2 2025 1:29 PM

Asaduddin Owaisi big statement on Pakistan Occupied Kashmir

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాదీనం చేసుకోండి  

ఈ అవకాశం వదులుకోవద్దు  

కేంద్రానికి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి, అక్కడే బైఠాయించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పీఓకేను స్వాదీనం చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సైనిక, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత సైన్యం దాడులు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్‌ సైనికాధికారులు విదేశాలకు పారిపోతుండడంపై స్పందించారు. అది చాలా మంచి పరిణామం అని చెప్పారు.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొరబడి, అక్కడే మకాం వేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఈ అవకాశం వదులుకోవద్దని స్పష్టంచేశారు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ దాడులు చేస్తామంటూ ప్రధాని మోదీ గతంలో హెచ్చరించారని, ఇప్పుడు ఆ పని చేసి చూపించాలని అన్నారు. పీఓకేను మన అ«దీనంలోకి తెచ్చుకోవాల్సిందేనని అసదుద్దీన్‌ ఒవైసీ తేల్చిచెప్పారు. పీఓకే భారత్‌కే చెందుతుందంటూ పార్లమెంట్‌లో ఇప్పటికే ఒక తీర్మానం ఆమోదించినట్లు గుర్తుచేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్‌ మద్దతు ఉంది కాబట్టి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదన్నారు. 

ఉగ్రదాడులకు చరమగీతం పాడాలి  
హైదరాబాద్‌లో లుంబినీ పార్కులో, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రస్తావించారు. ఉగ్రవాదులు ముంబైలో భీకర దాడులకు పాల్పడ్డారని, 2019లో పుల్వామాలో మన జవాన్లను ముష్కరులు బలి తీసుకున్నారని చెప్పారు. ముంబైలో వీటీ స్టేషన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఓ తెలుగు పండితుడు నవ వధువు అయిన తన కుమార్తెను పోగొట్టుకున్నాడని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఆ నవ వధువు చేతికి గోరింటాకు ఉందన్నారు. గత ఏడాది వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పర్యాటకులు మరణించారని వెల్లడించారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు తరచుగా కోరుతూనే ఉన్నాయని చెప్పారు. ‘‘అధికారంలో మీ చేతుల్లోనే ఉంది, ఇలాంటి దాడులకు చరమగీతం పాడండి’’ అని కేంద్ర ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement