ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ

Published Fri, Mar 8 2024 5:39 AM

Article 370 Move Allowed Jammu Kashmir To Show Its Abilities says PM Narendra modi - Sakshi

జమ్మూకశ్మీర్‌ హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది 

ఈ ఆర్టికల్‌పై కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించింది 

ప్రధాని మోదీ మండిపాటు 

జమ్మూకశ్మీర్‌లో రూ.5,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం  

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూకశ్మీర్‌ నూతన శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అబివృద్ధికి అడ్డుగోడగా మారిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేశాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, జమ్మూకశ్మీర్‌ హాయిగా ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. గురువారం జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు.

జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ‘చలో ఇండియా గ్లోబల్‌ డయాస్పోరా క్యాంపెయిన్‌’, ‘దేఖో ఆప్నా దేశ్‌ పీపుల్స్‌ చాయిస్‌ టూరిస్టు డెస్టినేషన్‌ పోల్‌’ అనే రెండు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ‘వికసిత్‌ భారత్‌–వికసిత్‌ జమ్మూకశ్మీర్‌’ బహిరంగ సభలో ప్రసంగించారు.

ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ పార్టీ జమ్మూకశ్మీర్‌ ప్రజలనే కాకుండా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ ఆర్టికల్‌ రద్దయ్యాక జమ్మూకశ్మీర్‌ సంకెళ్లు తెగిపోయాయని అన్నారు. అద్భుతమైన శ్రీనగర్‌ ప్రజల్లో ఈరోజు తాను కూడా ఒకడినైనందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను ప్రారంభించిన ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్‌ ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌ అనే స్వప్నం సాకారం కావాలంటే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని చెప్పారు.

మోదీతో కశ్మీర్‌ యువకుడి సెల్ఫీ  
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన యువకుడు నజీమ్‌ నజీర్‌ కల నెరవేరింది. సాక్షాత్తూ మోదీతో అతడు తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాదు నజీర్‌ను మోదీ తన స్నేహితుడిగా సంబోధించారు. గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. నజీర్‌ తేనెటీగల పెంపకం, తేనె వ్యాపారం చేస్తున్నాడు.

మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. దీంతో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం లభించింది. నజీర్‌ గురించి తెలుసుకున్న మోదీ అతడిని అభినందించారు. మీతో సెల్ఫీ తీసుకోవాలని నజీర్‌ కోరగా మోదీ అంగీకరించారు. ఈ సెల్ఫీని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. మిత్రుడు నజీర్‌తో సెల్ఫీ దిగడం మరిచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. తేనె వ్యాపారంతో నజీర్‌ తీపి విప్లవం తీసుకొచ్చాడని ప్రశంసించారు.

మీ కుటుంబ సభ్యులను పంపించండి  
భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూకశ్మీర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో ప్రగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌ కేవలం ఒక ప్రాంతం కాదని, ఇది మన దేశానికి శిరస్సు లాంటిదని చెప్పారు. తలెత్తుకొని నిలబడటం అభివృద్ధికి, గౌరవానికి గుర్తు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు తమ కుటుంబాల నుంచి కనీసం ఐదుగురిని జమ్మూకశ్మీర్‌ పర్యటనకు పంపించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు మోదీ మహాశివరాత్రి, రంజాన్‌ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ప్రధానమంత్రి కశ్మీర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.  

Advertisement
 
Advertisement