
మహిళకు ఆర్మీ వైద్యుని పునర్జన్మ
ఝాన్సీ: భారత ఆర్మీ.. సేవకు, త్యాగానికి మారు పేరు. ఆ పేరును మరోసారి నిలుపుకొన్నారీ ఆర్మీ వైద్యుడు. ఝాన్సీ స్టేషన్‌లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ భర్త, బిడ్డతో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. భర్త వెంటనే రైల్ మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్మీలో వైద్యుడైన 31 ఏళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు.
పన్వేల్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఝాన్సీకి చేరగానే ఆయనకు విషయం తెలిసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్టేషన్ లోని ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూ తి వార్డుగా మార్చారు. చిన్న కత్తి, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు, ధోతీ ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు. మహిళా రైల్వే సిబ్బంది సహకరించారు. ప్రసవం తర్వాత మహిళకు, పురిటి పాపాయికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న అతి సాధారణ వనరులతోనే ప్రసవం చేసిన మేజర్‌ను సైనిధికారులు కొనియాడారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.