breaking news
Army Doctor
-
రైల్వే స్టేషన్లో పురుడు!
ఝాన్సీ: భారత ఆర్మీ.. సేవకు, త్యాగానికి మారు పేరు. ఆ పేరును మరోసారి నిలుపుకొన్నారీ ఆర్మీ వైద్యుడు. ఝాన్సీ స్టేషన్లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ భర్త, బిడ్డతో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. భర్త వెంటనే రైల్ మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్మీలో వైద్యుడైన 31 ఏళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా ఝాన్సీ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు. పన్వేల్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఝాన్సీకి చేరగానే ఆయనకు విషయం తెలిసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్టేషన్ లోని ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూ తి వార్డుగా మార్చారు. చిన్న కత్తి, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు, ధోతీ ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు. మహిళా రైల్వే సిబ్బంది సహకరించారు. ప్రసవం తర్వాత మహిళకు, పురిటి పాపాయికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న అతి సాధారణ వనరులతోనే ప్రసవం చేసిన మేజర్‌ను సైనిధికారులు కొనియాడారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. -
ఛాతీలోకి లైవ్ గ్రనేడ్.. ఎలా కాపాడావయ్యా?!
కీవ్: తమపై దురాక్రమణలో రష్యా బలగాల అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఉక్రెయిన్ వాపోతోంది. ఏడాదికి సమయం దగ్గరపడుతున్నా.. ప్రాణ, ఆస్తి నష్టం కొనసాగుతుండడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఆర్మీ డాక్టర్ ఒకాయన చేసిన పని సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైవ్ గ్రనేడ్ ఒకటి ఓ సైనికుడి ఛాతీలో ఇరక్కుపోవడంతో.. ఆయన చాకచక్యంగా వ్యవహరించి దానిని బయటకు తీశాడు. ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా.. బక్ముట్ వద్ద భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో వీవోజీ గ్రనేడ్ లాంఛర్ ద్వారా దూసుకెళ్లాల్సిన ఓ లైవ్ గ్రనేడ్.. సైనికుడి ఛాతీలోకి వెళ్లిందట. అది ఏ క్షణమైనా అది పేలి అతను చనిపోవచ్చు. ఆ టైంలో మేజర్ జనరల్ డాక్టర్ అండ్రి విల్లో, సర్జరీకి దిగారు. తన ప్రాణాలకు తెగించి మరీ ఆపరేషన్ చేసి దానిని తొలగించి అతని పాలిట దేవుడిగా నిలిచాడు. ఆ డేరింగ్ ఆపరేషన్‌ను ఆయన ఇద్దరు సైనికుల సహకారంతో నిర్వర్తించడం విశేషం. వీవోజీ గ్రనేడ్ బాడీలోకి వెళ్లాక ఏమాత్రం చెదరలేదట. ఛాతీలో అలాగే చిక్కుకుపోయిందట. ఏమాత్రం పొరపాటు జరిగినా అది పేలిపోయి ఆ సైనికుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. అతనితో పాటు సర్జరీకి దిగిన వైద్యుడు కూడా హరీమంటాడు. ఆ సమయంలో ఎలెక్ట్రో కోగ్యులేషన్ చర్యకు దిగి ఉంటే.. కచ్చితంగా ఆ గ్రనేడ్ పేలిపోయేది. కానీ, మేజర్ ఆండ్రి విల్లో ఆ పని చేయలేదు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి.. ఆ సైనికుడి ప్రాణాలు నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం ధృవీకరించింది కూడా. అయితే సైనికుడి ఛాతీలోకి ఆ గ్రనేడ్ ఎలా వెళ్లిందనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎక్స్‌రే ద్వారా ఛాతీలో గ్రనేడ్ ఇరుక్కున ఫొటో, ఆపరేషన్ చేశాక ఆ గ్రనేడ్‌ను తొలగించిన ఫొటోలను మాత్రం రిలీజ్ చేసింది ఉక్రెయిన్ సైన్యం. -
గుంతకల్లులో విషాదం: డాక్టర్ ఆత్మహత్య
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఆర్మీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనం భరించలేక ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుంతకల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని భాగ్యనగర్ గంట చర్చి ఏరియాకు చెందిన వెంకటస్వామి, నాగమణి దంపతుల కుమారుడు కార్తీక్ వర్ధన్ (33)కర్నూలు మెడికల్ కాలేజీలో 2011లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తదనంతరం ఆగ్రా మిలటరీ హాస్పిటల్లో వైద్యుడిగా ఉద్యోగం పొందాడు. తనతో పాటు ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆదోనికి చెందిన డాక్టర్ అప్పియాను ప్రేమించి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. (చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో?) ఈమె ప్రస్తుతం పుణేలోని నేవీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా కార్తీక్‌వర్ధన్, అప్పియా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారు. వారం రోజుల క్రితం గుంతకల్లుకు వచ్చిన కార్తీక్ వర్ధన్ శనివారం రాత్రి వరకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు. కాగా తానొకచోట, భార్య, తల్లిదండ్రులు మరోచోట ఉండటంతో మనస్తాపానికి గురైన కార్తీక్‌వర్దన్ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పద్మావతి తెలిపారు. చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు -
సీడీఎస్ పరీక్ష వివరాలను తెలపండి?
ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలను తెలపండి? - సంధ్య, వరంగల్. ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గా లు.. ఒకటి ఆర్మ్డ్ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేయడం, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆర్మీలో డాక్టర్‌గా చేరడం. ఆర్మీలో డాక్టర్‌గా సేవలు అందించడానికి వేదికగా నిలుస్తోంది ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(ఏఎఫ్ఎంసీ)-పుణే. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ చేయడం ద్వారా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం ఏఎఫ్ఎంసీ జాతీయ స్థాయి లో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఏఎఫ్ఎంసీలో ప్రవేశానికి ప్రతి ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏటా 130 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఎంట్రెన్స్ టెస్ట్ 200 ప్రశ్నలకు, 200 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఇందుకోసం 2 గంటల సమయం కేటాయిస్తారు. బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్‌లపై 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లపై 25 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు తర్వాతి దశల్లో ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది. వీటి ఆధారంగా సీటు ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. భారతీయులై ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి. కనీస వయసు: 17 సంవత్సరాలు, గరిష్ట వయసు: 22 సంవత్సరాలు మించకూడదు. ఏఎఫ్ఎంసీ కాకుండా.. ఆర్మీ నేరుగా విడుదల చేసే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ కాప్స్‌ను రిక్రూట్ చేసుకుంటుంది. ఈ విధంగా కూడా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. సంబంధిత నోటిఫికేషన్ల కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా ఆర్మీ వెబ్సైట్ చూడొచ్చు. వివరాలకు: htpp://afmc.nic.in, htpp://indianarmy.nic.in సీడీఎస్ పరీక్ష వివరాలను తెలపండి? -సుశాంత్, హైదరాబాద్. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. త్రివిధ దశాల్లో కెరీర్ ప్రారంభంలోనే కమిషన్డ్ ర్యాంక్ ఆఫీసర్‌గా అడుగుపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్ష ద్వారా మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీల్లో ప్రవేశం లభిస్తుంది. అర్హత: ఇండియన్ మిలటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ. నావల్ అకాడెమీకి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్‌ఫోర్స్ అకాడెమీకి ఏదైనా డిగ్రీ (ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్,ఫిజిక్స్ చదివి ఉండాలి). సీడీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఆ తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎంపికైన వారికి ముందుగా త్రివిధ దళాలకు చెందిన ట్రైనింగ్ అకాడెమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ కోసం ఇండియన్ మిలిటరీ అకాడెమీ (డెహ్రాడూన్), నేవీ కోసం ఇండియన్ నేవల్ అకాడెమీ (కేరళ), ఎయిర్ ఫోర్స్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి చెందిన వివిధ ప్రాంతాల్లో., పురుషులు, మహిళల షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఆఫీ సర్స్ ట్రైనింగ్ అకాడెమీ (చెన్నై)లలో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఆయా దళాల్లో కమిషన్డ్ ర్యాంక్ అధికారి హోదాలో నియామకం ఖరారు చేస్తారు. సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలటరీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ అకాడెమీ ఔత్సాహికులకు ఒక విధంగా.. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ) ఔత్సాహికులకు మరో విధంగా ఉంటుంది. మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంశాల నుంచి..ఓటీఏ పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టు ల్లో పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు. సీడీఎస్ఈ నోటిఫికేషన్ ప్రతి ఏడాది సాధారణంగా రెండు సార్లు ఆగస్ట్, మార్చి నెలలో వెలువడుతుంది. ఆగస్ట్ నోటిఫికేషన్‌కు ఫిబ్రవరిలో, మార్చి నోటిఫికేషన్‌కు ఆగస్ట్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు: www.upsc.gov.in ఎంబీఏ (మీడియా మేనేజ్మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -పూజిత, జడ్చర్ల. మీడియూ రంగంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్మెంట్, మీడియా ప్లానింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియూ మేనేజ్మెంట్’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాధారణంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్సైట్లను నిర్వహించే సంస్థలు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం నెలకు రూ.15,000-30,000 మధ్య ఉంటుంది. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: } పద్మావతి వుహిళా విశ్వవిద్యాలయుం- తిరుపతి. వెబ్సైట్: www.spmvv.ac.in/ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- నోయిడా. వెబ్సైట్: ఠీఠీఠీ.్చ్చజ్ట.ఛిౌఝ దేవి అహల్య విశ్వవిద్యాలయ - ఇండోర్ వెబ్సైట్: www.emcdavv.edu.in ఇన్స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ - న్యూఢిల్లీ వెబ్సైట్: www.imcsindia.com మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ - బెంగళూరు. వెబ్సైట్: www.manipal.edu అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్-నోయిడా వెబ్సైట్: www.am-ity.edu ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ- న్యూఢిల్లీ. వెబ్సైట్: www.ignou.ac.in