అర్చన ఎక్కడ?.. పోలీసులకు మిస్టరీగా మిస్సింగ్‌ కేసు | Archana Tiwari vanished from Narmada Express in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

అర్చన ఎక్కడ?.. పోలీసులకు మిస్టరీగా మిస్సింగ్‌ కేసు

Aug 10 2025 7:24 AM | Updated on Aug 10 2025 7:30 AM

Archana Tiwari vanished from Narmada Express in Madhya Pradesh

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక యువతి రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అర్చనా తివారీ(28) సివిల్ జడ్జి కావడానికి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఏడో తేదీన ఆమె తన  ఇంటికి వెళ్లేందుకు ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. ఎక్స్‌ప్రెస్‌ రైలులోని బీ-3 బోగీలో కూర్చున్నారు. అయితే, ఆమె దిగాల్సిన స్టేషన్‌ కట్నీ వద్ద అర్చన కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రైలు వచ్చినప్పటికీ అర్చన మాత్రం రైలు నుంచి దిగలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతుండగానే.. రైలు స్టేషన్‌ నుంచి వెళ్లిపోయింది.

దీంతో, కుటుంబ సభ్యులు.. రైల్వే అధికారులను ఆశ్రయించడంతో.. పక్క స్టేషన్‌ ఉమారియాలో రైలు ఆగిన వెంటనే.. సదరు బోగీలో అర్చన కోసం వెతికినప్పటికీ ఆమె కనిపించలేదు. కానీ, ఆమె బ్యాగు మాత్రం బోగీలో లభించింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోజు ఉదయం 10:15 గంటల ప్రాంతంలో తాము చివరిసారిగా అర్చనతో మాట్లాడామని.. అప్పుడు రైలు భోపాల్ సమీపంలో ఉందని చెప్పారు. దీని తర్వాత అర్చన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని చెప్పుకొచ్చారు.

అనంతరం, కట్నీ రైల్వే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ మరావి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. భోపాల్‌లోని రాణి కమలపతి స్టేషన్‌లో అర్చన కనిపించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భోపాల్‌ స్టేషన్‌ తర్వాత సహ ప్రయాణికులు ఆమెను చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మూడు రోజులైనా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement