
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత జమ్మూకశ్మీర్ (jammu and kashmir)లో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మొన్న సోపియాన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ముష్కరులను ఎన్‌కౌంటర్ చేసింది. తాజాగా పుల్వామాలో ముగ్గురు జైహే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్‌లో జరిగిన ఓ ఎన్ కౌంటర్‌లో డ్రోన్ చిత్రీకరించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే, వీరిలో ఉగ్రవాది ఆమిర్ నజీర్ వని ఎన్‌కౌంటర్‌కు కొన్ని నిమిషాల ముందు తన తల్లి ఫోన్ చేశాడు. వారి మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
📞 ఆమీర్ నజీర్ వని,అతని తల్లికి మధ్య జరిగిన వీడియోకాల్ సంభాషణ:
ఆమీర్: ఏకే 47 పట్టుకుని.. అమ్మా... నువ్వు ఎలా ఉన్నావు?
తల్లి (ఎడుస్తూ): బేటా, నీవెక్కడ ఉన్నావు?"
ఆమీర్: ఇక్కడ ఓ బిల్డింగ్ బేస్మెంట్‌లో దాక్కున్నాను. భద్రతా బలగాలు దగ్గరకు వస్తున్నాయి
తల్లి: బేటా, వాళ్లకి లొంగిపో.. ప్రాణాలు కాపాడుకో.. నిన్ను చూడాలని ఉంది
ఆమీర్: తల్లి మాటలు పట్టించుకోలేదు. ‘ఆర్మీని ముందుకు రానివ్వండి… వారి సంగతి చూస్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు.
అనంతరం,ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరికి వీడియో కాల్ చేశాడు. ఆమె తన సోదరుడు ఆసిఫ్ అహ్మద్ షేక్ గురించి ఆరా తీసింది. ఆసిఫ్ తన వద్దే ఉన్నాడని చెప్పాడు. అది విన్న ఆమె భయ్యా మీరంతా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పగా.. నవ్వాడు. తామే ఆర్మీ పని పడుతామంటూ వివరించాడు. వీడియో కాల్ చేసిన కొద్ది సేపటికే భారత భద్రతా బలగాలు డ్రోన్ సాయంతో బేస్‌మెంట్‌లో నక్కిన ఉగ్రవాదుల్ని హతమార్చాయి.
Mother pleads son Amir Nazir Wani, a Jaish-e-Mohammed (#JeM) terrorist to surrender before the Tral encounter began. He spoke to his mother and sister. #encounter #tral #pulwama #jammuandkashmir pic.twitter.com/t18ZsqDs7f
— Madhuri Adnal (@madhuriadnal) May 15, 2025
గురువారం ఉదయం త్రాల్ ప్రాంతంలో నదీర్ గ్రామంలో ముష్కరులు నక్కినట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అసిఫ్ అహ్మద్ షేక్,ఆమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్గా హతమయ్యారు.
ఈ కాల్పులు జరిగే సమయంలో ఉగ్రవాది ఆమీర్ నజీర్ వని నిర్మాణంలో ఉన్న బేస్మెంట్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. అయితే, అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాల్ని రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఒక పిల్లర్ చాటున నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. డ్రోన్ విజువల్ సాయంతో దళాలు అతన్ని మట్టుపెట్టాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే.