
సాక్షి,న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు.‘ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతోంది ..అంటూ, జీఎస్టీ విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ మార్పుల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు తగ్గి, ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా దేశ ప్రజలకు ఊరట కలిగించేలా మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా, నిత్యవసర వస్తువులపై విధించే పన్నును తగ్గిస్తున్నాం. వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా, జీఎస్టీ స్లాబ్‌లను వరిస్తున్నామన్నారు. ఈ దీపావళి నాటికి, సామాన్యుల జీవితాన్ని మరింత సులభతరం చేసేలా, సరళీకృత జీఎస్టీ విధానాన్ని మీరు చూస్తారు’ అని హామీ ఇచ్చారు.
హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు జరిపి ఈ దీపావళికి బహుమతిగా ఇస్తాం. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారి వస్తువుల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి’ అని కోరారు.