
సాక్షి,న్యూఢిల్లీ: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ.. దేశ భద్రతపై తన దృఢమైన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.
పాకిస్తాన్ పదే పదే చేస్తున్న అణు బెదిరింపులను ఖండించారు. అణు దాడుల బెదిరింపులకు భారత్ భయపడదని తేల్చి చెప్పారు. అదే సమయంలో సింధూ జలాల ఒప్పందానికి తాము అంగీకరించబోమని పాక్‌కు స్పష్టం చేశారు. రక్తం, నీరు కలిసి పారటం కుదరదన్నారు.
సింధూ జలాల ఒప్పందం కారణంగా నా దేశ భూమి నీరు లేక కటకటలాడింది. రైతులు నీరు లేక అనేక బాధలు పడ్డారు. ఇకపై రైతులు అలాంటి బాధలు పడకూడదు. భారతదేశానికి హక్కుగా చెందాల్సిన నీరు భారతదేశానికి మాత్రమే’ అని తెలిపారు.
నయా భారత్ థీమ్‌తో
అంతకు ముందు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్ర కోట వేదిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. న్యూఇండియా (Naya Bharat) అనే థీమ్ ప్రతిబింబించేలా వస్త్రధారణతో దేశభక్తిని చాటిచెప్పారు. ఇక ప్రధాని మోదీ ఇది వరుసగా 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. ఆచారం ప్రకారం, ప్రధానమంత్రి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పగుచ్ఛాలు అర్పించి, జాతినుద్దేశించి ప్రసంగించే ముందు రెడ్ ఫోర్డ్ వద్ద ఉన్న చారిత్రాత్మక లాహోరి గేట్ (ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాన ద్వారం) వద్దకు చేరుకున్నారు. అక్కడ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, తన ప్రసంగాన్ని ప్రారంభించారు.