
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ వినియోగించే వస్తువులపై విధించే పన్నును తగ్గించడంతో పాటు దేశంలో యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నా దేశ యువత కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana) పేరుతో ఈ కొత్త పథకం అందుబాటులోకి తెస్తున్నాం. ఈ కొత్త పథకం ఈ రోజు నుంచే అమలులోకి వస్తోంది. ఈ పథకం కింద, ప్రైవేట్ రంగంలో మొదటి ఉద్యోగం పొందుతున్న యువతకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తద్వారా ద్వారా 3.5 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రూ.15 వేలు కేంద్రం ఎలా ఇస్తుంది
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ. 15,000 వరకు పొందవచ్చు. రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు అర్హులు. ఆరు నెలల సర్వీస్ తర్వాత మొదటి విడత .. మరో ఆరునెలల సర్వీస్‌లో రెండో విడుత కింద అందిస్తుంది.
రూ.15వేలను ఎలా డ్రా చేసుకోవచ్చు
సేవింగ్స్‌ను ప్రోత్సహించేలా కేంద్రం అందించే రూ.15వేలులో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో నిర్ణీత కాలం వరకు ఉంచుతుంది. ఆ తర్వాత మొత్తాన్ని సదరు ఉద్యోగి విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ చెల్లింపు ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ఉపయోగించి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) మోడ్ ద్వారా జరుగుతాయి.