ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా... | Bollywood Actress Alia Bhatt Emotional Post For Indian Soldiers, Read More Details Inside | Sakshi
Sakshi News home page

ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...

May 14 2025 12:37 AM | Updated on May 14 2025 4:42 PM

Alia Bhatt Emotional Post For Indian Soldiers

కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ఇండియన్‌ ఆర్మీ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్‌ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్‌ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

తాజాగా హీరోయిన్‌ ఆలియా భట్‌ కూడా ఇండియన్‌ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగమైనపోస్ట్‌ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్‌లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.

ఆదివారం మనమంతా మదర్స్‌ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్‌ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.

అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్‌’’ అంటూపోస్ట్‌ చేశారు ఆలియా భట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement