తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, టీఎఫ్‌డీసీ దిల్ రాజు హాజరయ్యారు. ఈ వేదికపైనే జ్యూరీ సభ్యులకు మెమొంటోలతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు.
కాగా.. ఇప్పటికే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్ ప్రకటించారు. తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా అవార్డులను అందజేశారు. గద్దర్ -2025 ఫిల్మ్ అవార్డ్స్‌లో రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్ సినిమాలు అత్యధికంగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి.
తండేల్ సినిమాకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) మూవీకి గాను ఉత్తమ నటిగా ఎంపికైంది. ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. నటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు దక్కడం విశేషం. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు వరించింది.


