మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షల పంపిణీ
పరామర్శ సందర్భంగా కంటతడి
సాక్షి, చెన్నై: కరూర్ బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రాణనష్టంపై ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి తలా రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గత నెల 27న కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించారు.160 మంది గాయపడ్డారు.
ఈ కుటుంబాలను కరూర్‌కు వెళ్లి పరామర్శించేందుకు తొలుత విజయ్ నిర్ణయించారు. అయితే, అనుమతుల మంజూరు, స్థల ఎంపిక సమస్యలు నెలకొనడంతో చివరకు బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించి ఒకే చోట పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో 8 కుటుంబాలు గైర్హాజరైనా మిగిలిన కుటుంబాలన్నీ చెన్నైకు వచ్చేందుకు సమ్మతించాయి. వీరందర్నీ ప్రత్యేక బస్సుల్లో చెన్నైకు తీసుకొచ్చారు. మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో కుటుంబాన్ని విజయ్ వేర్వేరుగా పరామర్శించారు.
15 నుంచి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఓదార్చారు. ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లల చదవులకు అండగా ఉంటానని, ఖర్చులు భరిస్తానని విజయ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొన్ని కుటుంబాల్లోని వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు కూడా హామీ ఇచ్చారని తెలిసింది.


