
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో 71 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో లొంగిపోయిన ఈ మావోయిస్టులలో 50మంది పురుషులు, 21మంది మహిళలు ఉన్నారని సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులలో 30 మందిపై రూ.64లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా అమలు చేయడం, దీనికితోడు ప్రభుత్వ పునరావాస విధానం అమలు అవుతున్నందున నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు. మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేస్తుండడంతో మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు గతంలో పలు విధ్వంసక సంఘటనలలో పాల్గొన్నారని బస్తర్ ఐజీ వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వీడేలా చేయడమే తమ ఉద్దేశమని, జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు.. జార్ఖండ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ప్రస్తుతం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే జార్ఖండ్‌లో కూడా భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా, ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.