ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు, మాజీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారులు లేఖ రాశారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
‘ఓట్ చోరీ’ ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలన్న మాజీ న్యాయమూర్తులు.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) చట్టపరమైన నిబంధనల ప్రకారమే జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను మీడియా వేదికల కంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని లేఖలో మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.
కాగా, ‘సర్’పై దేశ రాజధానిలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భద్రతను మరింత పెంచారు. ఆయనకు ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత అందించగా, ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జ్ఞానేశ్ కుమార్‌కు ముప్పు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: ఫారమ్-6పై సుప్రీంకోర్టు మొట్టికాయలు.. వెనక్కి తగ్గిన కేంద్ర ఎన్నికల సంఘం!


