‘చేనేత’ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘చేనేత’ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

నారాయణపేట: జిల్లాలోని గాంధీనగర్‌, లక్ష్మీపల్లి, చిన్నజట్రం చేనేత సొసైటీల్లో రూ.51 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆర్టీఐ ద్వారా అధికారులు వెల్లడించారని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గంజి మురళీధర్‌ డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష పార్టీలు, చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టగా ఆయన పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన సొసైటీలు ప్రస్తుతం నిజమైన కార్మికులకు ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీల అక్రమాలపై కలెక్టర్‌ ప్రత్యేక విచారణ అధికారిని నియమించాలని కోరారు. పేటలోని కొన్ని సొసైటీలు అవినీతి, అక్రమాలకు కేంద్రాలుగా మారడం ఆందోళన కలిగిస్తోందని.. చేనేతశాఖ అధికారులు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు కుమ్మకై ్క ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. చేనేత కార్మికులకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాలని, చేనేతను ప్రత్యేక శాఖగా గుర్తించాలని కోరారు. కార్మికులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 1,251 జియో ట్యాగింగ్‌లు ఉన్నట్లు అధికారులు నివేదికలు ఇస్తున్నప్పటికీ వాటిలోనూ అవకతవకలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. నారాయణపేటలో 100కు మించి మగ్గాలు లేని పరిస్థితిలో సుమారు 414 మందికి జియోట్యాగింగ్‌ కల్పించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చేనేత సంక్షేమ పథకాల అమలులో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గాంధీనగర్‌ చేనేత కార్మికుల ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించాలని, అక్రమాలకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులను వెంటనే తొలగించాలని కోరారు. 4,267 మంది చేనేత కార్మికుల వారసత్వ సభ్యత్వాన్ని కల్పించాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్ల వినతిపత్రాన్ని అఖిలపక్ష నేతలు కలెక్టర్‌ ప్రియాంకకు అందజేశారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామిరెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుదిగల శ్రీనివాస్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు మణికంఠగౌడ్‌, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కెంచె నారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, గోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement