గణేష్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

మట్టి విగ్రహాలనే పూజిద్దాం..

నారాయణపేట: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ప్రియాంక ఆదేశించారు. వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు, గణేష్‌ ఉత్సవ కమిటీలు, మతపెద్దలు పరస్పర సహకారంతో వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి సమస్యలను గుర్తించాలన్నారు. పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, విద్యుత్‌శాఖలతో ప్రత్యేక సమన్వయ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. నిమజ్జన వేడుకలను యూట్యూబ్‌ లైవ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, సిబ్బంది, ఇంటర్నెట్‌ వనరులను వినియోగించి తక్కువ వ్యయంతో ఎక్కువ మందికి కార్యక్రమాన్ని చేరువ చేయాలని సూచించారు. లైవ్‌ లింక్‌ను మీడియా సంస్థలకు అందుబాటులో ఉంచాలని డీపీఆర్వో రషీద్‌ను ఆదేశించారు. అనంతరం ఎస్పీ డా. వినీత్‌ మాట్లాడుతూ.. ప్రతి మండపం వద్ద నిర్వాహకుల తరఫున ఒక వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమించి పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటు, విగ్రహాల పరిమాణం, ఊరేగింపు మార్గం, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఊరేగింపులో మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌ వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, సమయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. విశ్వహిందూ పరిషత్‌, ముస్లిం మతపెద్దలు పరస్పర సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్‌, ఎస్పీ కోరారు. చిన్నపాటి వివాదాలు తలెత్తినా స్వయంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్‌, పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, డీపీఆర్వో రషీద్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో బుధవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన మట్టి గణేష్‌ విగ్రహాల పోస్టర్లను ఎస్పీ డా. వినీత్‌తో కలిసి కలెక్టర్‌ ప్రియాంక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగంతో చెరువులు, ఇతర జల వనరులు కలుషితమవుతున్నాయని, పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement