నర్వ: ఒడిశా రాష్ట్రంలోని మహేంద్రగిరిలో జరగనున్న జాతీయస్థాయి సైక్లింగ్ చాంపియన్ పోటీలకు రాష్ట్రం తరఫున నర్వ కేజీబీవీ పీఈటీ త్రివేణి ప్రాతినిథ్యం వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు పీఈటీ ఎంపికై నట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి బి.గోపాలం తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెను ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ రాఘవేందర్, ప్రత్యేక అధికారి గోపాలచారి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. కేజీబీవీ విద్యార్థులను రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి వెళ్లేలా ఆమె కృషిచేశారన్నారు. గ్రామీణస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దిన పీఈటీని వారు అభినందించారు.
ముంపు నిర్వాసితులను ఆదుకుంటాం
మక్తల్: జూరాల వెనక జలాల ముంపునకు గురైన గ్రామాల ప్రజలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని అంకెన్‌పల్లి ఆర్‌ఆర్ సెంటర్ ఏర్పాటుకు భూములిచ్చేందుకు గ్రామస్తులు తమ సమ్మతిని ఏకగ్రీవంగా తెలియజేశారు. అంకెన్‌పల్లి ఆర్‌ఆర్ సెంటర్‌కు అవసరమైన 67.19 ఎకరాల భూ సేకరణకు సంబందించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని ఆయన తెలిపారు. ఎస్‌ఈఎస్ సర్వే నివేదికను ఆమోదిస్తూ గ్రామస్తులందరూ తీర్మానం చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ డిప్యూటీ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ సతీష్‌కుమార్, సర్పంచ్ రాజమ్మ, మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలసందలు
క్వింటా రూ.6,495
నారాయణపేట: స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం అలసందలు క్వింటా గరిష్టంగా రూ.6,495, కనిష్టంగా రూ.4,529 ధర పలికింది. అలాగే పెసర రూ.9,319, రూ.4,309, మినుములు సరాసరి ధర రూ.6,929 ధరలు లభించాయి.
ఉద్యోగుల
మహాధర్నా వాయిదా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన మహాధర్నాను వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈనెల 18న సీఎం రేవంత్‌రెడ్డితో నాయకులు భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.


