● 18 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు
● 2 ఎకరాల్లో మట్టి ప్రదర్శన కేంద్రానికి ప్రతిపాదన
● ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ..
అధికారుల కసరత్తు
నారాయణపేట: మండలంలోని లింగంపల్లి శివారులో ఇప్పటికే 20 ఎకరాల్లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా.. మరో 20 ఎకరాలు కేటాయిస్తే అందులో 18 ఎకరాల్లో రైతు నైపుణ్యాభివృద్ధి కేంద్రం, 2 ఎకరాల్లో మట్టి ప్రదర్శన కేంద్రం (సాయిల్ మ్యూజియం) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి చొరవతో భూమి, బడ్జెట్, మౌలిక వసతులపై అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయమై గతంలోనే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విన్నవించి వినతిపత్రం అందజేశారు.
సాయిల్ మ్యూజియం..
జిల్లా నేలల వైవిధ్యాన్ని కేవలం వ్యవసాయ భూ ముల్లోనే కాకుండా శాసీ్త్రయంగా భద్రపరిచి ప్రజలకు పరిచయం చేసే సాయిల్ మ్యూజియం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మండలంలోని లింగంపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పరిధిలోనే 2 ఎకరాల్లో సాయిల్ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
పర్యాటకానికి కొత్త చిరునామా..
సాయిల్ మ్యూజియాన్ని వ్యవసాయ, విద్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు మరో ప్రత్యేకత చేకూరనుంది. రైతులు, విద్యార్థులు, పరిశోధకులతో పాటు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న సందర్శకులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.


