పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు | - | Sakshi
Sakshi News home page

పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

నారాయణపేట: విద్యను ఆయుధంగా చేసుకొని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు యువత నిరంతరం కష్టపడాలని ఎస్పీ డా. జి.వినీత్‌ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆపరేషన్‌ మెర్సీఇండియా ఫౌండేషన్‌న్‌ ఆధ్వర్యంలో జోగినుల పిల్లలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, నిరుపేద మహిళలు, హెల్త్‌ వర్కర్లకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనపై యువతలో బలమైన తపన ఉండాలని, ఆకలితో ఉన్నప్పుడు ఆహారం కోసం ప్రయత్నించినట్టే ఉద్యోగం కోసం అలాగే ప్రయత్నించాలని సూచించారు. ఉద్యోగం సాధించాలనే తపన బలంగా ఉన్నప్పుడే దాని కోసం కష్టపడగలుగుతామని తెలిపారు. వైఫల్యాలు ఎదురైతే నిరుత్సాహపడకుండా వాటిని అనుభవాలుగా మార్చుకొని మరింత పట్టుదలతో ముందుకుసాగాలని సూచించారు. ప్రస్తుతం పోలీస్‌శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్‌న్‌ వెలువడిన నేపథ్యంలో త్వరలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని ఎస్పీ ప్రకటించారు. పోలీస్‌ ఉద్యోగాలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం విద్యావంతమవుతుందని.. విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, మంచి ఆలోచనా విధానం, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని కోరారు. యువత చెడుకు దూరంగా ఉంటూ చదువు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ సాధనకు సమయం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఆపరేషన్‌ మెర్సీఇండియా ఫౌండేషన్‌న్‌ మేనేజర్‌ ఏంజెలా డేవిస్‌, జిల్లా కో–ఆర్డినేటర్‌ హాజమ్మ, హెల్త్‌వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు : ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement