16 అధ్యాపక పోస్టులు మంజూరు | - | Sakshi
Sakshi News home page

16 అధ్యాపక పోస్టులు మంజూరు

Jul 19 2026 2:08 AM | Updated on Jul 19 2026 2:08 AM

మద్దూర్‌ (కోస్గి): కమిషనర్‌ ఆ్‌ఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలకు 16 పోస్టులు మంజూరయ్యాయని.. 2026–27 విద్యా సంవత్సరానికిగాను అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు తెలిపారు. శనివారం కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్‌ ఇంజినీరింగ్‌–4, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌–3, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌–3, గణితం–2, భౌతికశాస్త్రం–2, రసాయన శాస్త్రం–2 ఖాళీలున్నాయని.. ఏఐసీటీఈ నిర్దేశించిన అర్హతలున్న అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత పత్రాలతో ఈ నెల 20 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 23న ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నేడు విద్యుత్‌ అంతరాయం

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు పట్టణ ఏఈ మహేష్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని యాద్గిర్‌ రోడ్‌, చిల్డ్రన్స్‌ ఆస్పత్రి, సివిల్‌–1, సివిల్‌–2, సత్యసాయి, వీఐపీ ఫీడర్ల ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని.. గృహ, వాణిజ్య వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో

ఓటుహక్కు కల్పించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సర్పంచ్‌ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్‌ చెక్‌పవర్‌ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్‌ఆర్‌జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్‌ వెంటనే గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్‌–2047, వికసిత్‌ భారత్‌ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్‌ రాజశేఖర్‌, వనపర్తి జిల్లా కన్వీనర్‌ శేఖర్‌గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఈ–కేవైసీ తప్పనిసరి

నారాయణపేట: జిల్లాలోని రేషన్‌ లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.బాలరాజు శనివారం ఒక ప్రకటనలో కోరారు. రేషన్‌కార్డులో నమోదైన ప్రతి సభ్యుడు సమీపంలోని చౌకధర దుకాణానికి వెళ్లి ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ ధ్రువీకరణ ద్వారా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని సభ్యులకు భవిష్యత్‌లో రేషన్‌ పంపిణీతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా ఇతర కారణాలతో వెళ్లలేని వారి వివరాలను ముందుగానే సంబంధిత చౌకధర దుకాణ డీలర్‌కు తెలియజేయాలని సూచించారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని రేషన్‌ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వేరుశనగ క్వింటా రూ.9,041

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 840 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,041, కనిష్టంగా రూ. 4,369, సరాసరి రూ. 6,581 ధరలు లభించాయి. అదే విధంగా 7 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటా రూ. 2,711 ధర పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement