నకిలీ.. మకిలీ | - | Sakshi
Sakshi News home page

నకిలీ.. మకిలీ

Jul 19 2026 2:08 AM | Updated on Jul 19 2026 2:08 AM

పోలీసుల అదుపులో డీలర్లు

ఇలా గుర్తు పట్టండి..

ఉమ్మడి పాలమూరులో నకిలీ డీఏపీ కలకలం

ఈ జాగ్రత్తలు పాటించండి..

నకిలీ ఎరువులు ఇదే మొదటిసారి..

తెలిసీ వివరాలు

వెల్లడించకుంటే చర్యలు..

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి

మండలంలో వెలుగులోకి..

మహదేవునిపేటలో

117 ఎరువుల బస్తాలు స్వాధీనం

రైతులు వినియోగించిన

39 ఖాళీ సంచులు సైతం..

కర్ణాటక నుంచి వచ్చి

విక్రయించినట్లు అనుమానాలు

గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ

విక్రయాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

వెలుగులోకి ఇలా..

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్‌, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు.

గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ..

నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించి కర్ణాటకకు చెందిన పలువురు దళారులు ఉన్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బిజినేపల్లిలో వెలుగులోకి రాగా.. సమీప మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. వనపర్తి, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో తక్కువ ధర పేరిట వేలాది మంది రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను టార్గెట్‌గా చేసుకుని కేటుగాళ్లు దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ డీఏపీ ఎరువుల దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోసపోయిన రైతులు కలవరపడుతున్నారు. తమ బాధను వెల్లగక్కలేక, మింగలేక మథనపడుతున్నారు.

రైతుల్లారా బీ అలర్ట్‌..

డీఏపీ.. డై అమ్మోనియం ఫాస్పేట్‌. వ్యవసాయంలో అత్యంత ప్రాముఖ్యత గల ఎరువు. విత్తనాలు విత్తే సమయంలో గానీ.. నాట్లు వేసేటప్పుడు గానీ దీన్ని బేసల్‌ ఎరువుగా వేస్తారు. వేరు వ్యవస్థ అభివృద్ధి, పంట ఎదుగుదల, అధిక దిగుబడికి ఇది దోహదం చేస్తుంది. అలాంటి ఈ ఎరువు అసలుదా.. నకిలీదా అని గుర్తు పట్టేందుకు మూడు రకాలుగా పరీక్షించాలని రైతులకు వ్యవసాయాధికారులు పలు సూచనలు చేశారు.

డీఏపీ గింజను గోరుతో గట్టిగా నొక్కాలి. గింజ రాయిలా గట్టిగా ఉండి.. పగలకుంటే మంచిది. మట్టిగడ్డలా పొడిపొడిగా రాలిపోతే నకిలీది.

కొన్ని డీఏపీ గింజలను చేతిలోకి తీసుకుని పాన్‌ (తాంబూలం)లో వేసే తడి సున్నం కలిపి బాగా రుద్దాలి. ఘాటైన వాసన (అమ్మోనియా) వస్తే అసలైన డీఏపీ. ఎలాంటి వాసన రాకపోతే రాతి పొడితో చేసిన నకిలీ ఎరువు అని గ్రహించవచ్చు.

కొన్ని డీఏపీ గింజలను ఇనుప పెనం మీద వేసి వేడి చేయాలి. వేడికి ఉబ్బి కరిగిపోతే అసలైన డీఏపీ. కరగకుండా గట్టిగా ఉంటే నకిలీది.

లైసెన్స్‌ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనాలి.

కొన్న తర్వాత దుకాణాదారుడి నుంచి కచ్చితంగా రశీదు తీసుకోవాలి.

రాత్రి వేళ లేదా అనుమానాస్పద వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తుందని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు.

ఎరువుల నాణ్యతపై అనుమానం వస్తే వెంటనే వ్యవసాయాధికారికి సమాచారం అందించాలి.

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో అనుమతి ఉన్న విత్తన, ఎరువుల దుకాణాల్లో ఈ సారి పత్తి విత్తనాలు తక్కువగా అమ్ముడుపోయాయి. రైతులు ఎక్కడి నుంచో పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు అనుమానం ఉంది. నిఘా పెట్టడంతో పలు చోట్ల నకిలీ విత్తనాలు దొరికాయి. కానీ నకిలీ డీఏపీ ఎరువులు పట్టుబడడం ఉమ్మడి జిల్లాలో ఇదే మొదటిసారి అనుకుంటా. కర్ణాటక, గద్వాల సరిహద్దుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. – చంద్రశేఖర్‌,

జిల్లావ్యవసాయాధికారి, నాగర్‌కర్నూల్‌

నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై రైతులు అలర్ట్‌గా ఉండాలి. వీటిని విక్రయించిన వారు, ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు. కొనుగోలు చేసిన రైతులు నకిలీ డీఏపీ ఎరువులను అంటగట్టిన వారి వివరాలు వెల్లడించకపోతే.. వారిపైనా చర్యలు తప్పవు. అవసరమైతే కేసులు పెట్టాల్సి వస్తుంది. – హేమంతకేశవ్‌ పాటిల్‌,

కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ డీఏపీ విక్రయాలకు సంబంధించి పోలీసులు కొందరు డీలర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేటలో 111 బస్తాలు నకిలీ డీఏపీ దొరికిన వ్యవహారంపై పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లిలో సైతం విక్రయించినట్లు తెలిసింది. దీంతో మాహదేవునిపేట, అమ్మపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్‌ దుకాణాలు నడిపే కొందరు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వ్యవసాయాధికారులు నకిలీ డీఏపీ నమూనాలను శనివారం టెస్టింగ్‌ కోసం హైదరాబాద్‌కు పంపించగా.. మంగళవారం నివేదిక రానుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement