జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలని అందుకు బ్యాంకర్లు సహకరించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన బ్యాంక్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వర్లుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అందుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇచ్చి లక్ష్యానికి చేరువ చేయాలన్నారు. గతంలో ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి రూ.5 లక్షల వరకు రుణం ఇచ్చేవారని ప్రస్తుతం రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నారని చెప్పారు. ఇందులో రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం వస్తుందన్నారు. మహిళలను పెద్ద పెద్ద వ్యాపారులుగా చేయడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నర్సింహులు, ఏపీడీ రేణుక, డీపీఎం లక్ష్మయ్య, డీజీఎం రామచంద్రరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ దామోదర్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.


