బీఆర్‌ఎస్‌కు షాక్‌...కాంగ్రెస్‌లోకి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు షాక్‌...కాంగ్రెస్‌లోకి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి

Published Sun, Jun 18 2023 6:12 AM

- - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కాంగ్రెస్‌లో పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇరువురి మధ్య విస్త్రృతస్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పగా.. చివరగా ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది.

పార్టీ అధిష్టానం టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఇరువురు నేతలు సంపూర్ణ మద్దతుతో సహకారం అందించుకోవాలని ముఖ్య నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇక కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

కలుసుకున్న పాత మిత్రులు
సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ఇరువురు ముఖ్యనేతలు కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో రాష్ట్ర ఉన్నత స్థాయి నేతల సమక్షంలో శనివారం జరిగిన భేటీలో ఇరువురి మధ్య సయోధ్య కుదిరి మళ్లీ కలసిపోనున్నట్లు తెలుస్తోంది. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మొదటి నుంచి నాగం జనార్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో నాగం టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూచుకుళ్ల ఆయన కోసం పనిచేశారు. అనంతరం 1998 సంవత్సరం వరకు నాగం వెంటే ఉండి ఆయనకు మద్దతుగా నిలిచారు.1999 ఎన్నికల సమయంలో నాగంతో విభేదించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బలపడనున్న వీరి బంధం ఎలాంటి ప్రభావం చూపనుందోననే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఎన్నికల ఏడాదిలో బీఆర్‌ఎస్‌కు షాక్‌ ..
సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో కలవడం తమకు ఎంతో కలసివస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తుండగా, ఆయన పార్టీ మారినా తమకు ఢోకా ఉండదని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement