వెట్టి నుంచి విముక్తి
నారాయణపేట: పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు పని బాట పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తెలిసో తెలియకో తమ పిల్లలను పనులకు పంపించి బాలకార్మికులుగా మారుస్తున్నారు. బడిఈడులో బాధ్యతలు మీదేసుకొని ఆ పనుల్లోనే మగ్గిపోతున్నారు. అలాంటి బాలల భవిష్యత్ అంధకారం కాకుండా ప్రభుత్వం ఏటా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తప్పిపోయిన, బాలకార్మికులుగా పనిచేస్తున్న వారి ని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ పాఠశాలలో చేర్పిస్తున్నారు. చిన్నారులతో పనులు చేయిస్తే యజమానులపై కేసులు సైతం నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటం లేదు.
స్పెషల్ డ్రైవ్..
ఎస్పీ డా. వినీత్ దిశానిర్దేశంలో ఈ ఏడాది పోలీసు, కార్మిక, ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమం నిర్వహిస్తూ బాల కార్మికులను గుర్తించేందుకు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టి 1,125 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలలను పనుల్లో పెట్టుకున్న 59 మంది యజమానులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
ప్రత్యేక బృందాలతో..
బాలకార్మికులను గుర్తించి పని నుంచి విముక్తి కల్పించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐతో పాటు పోలీస్ సిబ్బంది, కార్మికశాఖ, చిల్డ్రన్, 1098, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, బాలరక్ష భవన్, సఖి, ఐసీడీసీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. బాలల హక్కులు కాపాడేందుకు పోలీసు, ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఇతర ప్రదేశాలపై నిఘా ఉంచి ఆకస్మిక దాడులు చేసి బాల కార్మికులను గుర్తించారు.
9 రోజుల్లో 21 మంది..
బాలకార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు నింపడమే ధ్యేయంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తొమ్మిది రోజుల్లో 21 మంది బాలలను గుర్తించి.. 16 మందిపై కేసులు నమోదు చేశారు. 12వ విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం 31వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో ఏడేళ్లుగా ఆపరేషన్ స్మైల్ కింద 604 మందికి, ఆపరేషన్ ముస్కాన్ కింద 521 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. అయితే ఈ ఏడాది చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో 21 మంది చిన్నారులకు విముక్తి కల్పించడంతో 625 మందికి చేరినట్లయింది.
జిల్లాలో కొనసాగుతున్నఆపరేషన్ స్మైల్
ఇప్పటి వరకు 21 మంది
చిన్నారుల గుర్తింపు
ఏడేళ్లలో 1,125 మంది బాలకార్మికులు
వెట్టి నుంచి విముక్తి


