మద్దికెర: మండల పరిధిలోని బొమ్మనపల్లి సచివాలయం కార్యదర్శి మంజునాథ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని పరారయ్యాడని మండల కేంద్రంలోని సచివాలయం–2లో మహిళా పోలీసుగా పనిచేస్తున్న రాజేశ్వరి ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది స్థానిక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలోనే తాము పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. దాదాపు 8 నెలలుగా ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతూ చివరకు పరారయ్యాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించి న్యాయం చేయాలని కోరారు.
కామేశ్వరీదేవికి ఆషాఢమాసం సారె
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా చీర, సారె సమర్పించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఏఈఓ ఎరమల మధు, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, పండితులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ మేరకు వారు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో గవర్నర్స్ జిల్లా ఆఫీసర్స్ లింగం నాగశైలజ, మునగనూరు శ్రీలక్ష్మీతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు పాల్గొన్నారు.


