మా కుమారుడు కార్తీక్ గతేడాది స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివాడు. మాకు ఎటువంటి పొలాలు లేవు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గతేడాది మొదట తల్లికి వందనం డబ్బులు పడలేదు. అప్పట్లో సచివాలయం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాం. చాలా రోజులకు రూ. 8 వేలు వేశారు. మిగతా డబ్బులు మళ్లీ పడతాయని సెల్ ఫోన్‌లో మేసేజ్‌లు చూసుకుంటూ ఉన్నాం. చదువు పూర్తయినా ఇంత వరకు పడలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి డబ్బులు పడ్డాయి. ఈఏడాదైనా మాలాంటి పేదలకు పూర్తిగా న్యాయం చేయాలి.
– సునీత, గడివేముల
ఎన్నికల సమయంలో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం డబ్బులు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటను మొదటి ఏడాది పూర్తిగా వదిలేశారు. గత ఏడాది ఎంతో మంది పేదలు తల్లికి వందన కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకానికి అర్హులైన విద్యార్థుల కుటుంబాల విద్యార్థులకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు.
– శివశంకర్‌రెడ్డి, విద్యార్థుల తండ్రి,
సాంబవరం, గోస్పాడు మండలం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి నేతలు ఎలాంటి షరతులు లేకుండా ఈ ఏడాదైనా అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించాలి. నిబంధనలతో అనర్హులుగా ప్రకటించడం తగదు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందించాలి. రూ.13 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సహించేది లేదు. స్కూళ్లు తెరిచిన నెలలో ఇస్తే బాగుండేది. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే ఆందోళనలు చేస్తాం.
–ఎర్రిస్వామి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సెక్రటరీ
మా కుమారుడు సగినేల కార్తీక్ గతేడాది పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుకున్నాడు. తల్లికి వందనం 9వ తరగతికి సంబంధించిన డబ్బులు అరకొరగా రూ.10, 500 ఇచ్చింది. మిగతా డబ్బులు 10వ తరగతి పూర్తయినా రాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎటువంటి కోతలు లేకుండా ప్రతి సంవత్సరం అమ్మఒడి రూ.13 వేలు బ్యాంకు ఖాతాలో వేసింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం కింద అరకొర వేసి చేతులు దులుపుకుంది.
– సగినేల నాగరాజు, వనములపాడు,
పగిడ్యాల మండలం


