కాటేజీలో ‘ప్రైవేట్‌ వ్యాపారం’.. | - | Sakshi
Sakshi News home page

కాటేజీలో ‘ప్రైవేట్‌ వ్యాపారం’..

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

దాతలు నిర్మించిన కాటేజీల్లో అధికారుల మకాం

భవనం పూర్తి కాలేదనే సాకుతో ఈవో సైతం

ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అర్చకులు ఆయన బాటలోనే..

మరో కాటేజీని సొంతం చేసుకున్న ఓ సహాయ వంట మనిషి

అందులోనే ప్రయివేట్‌ వ్యాపారానికి ఒప్పందం

మల్లన్న ఆదాయానికి రూ.కోట్లలో నష్టం

ఈఓ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తాం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల క్షేత్ర పరిధిలో దాతలు నిర్మించిన కాటేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. కొందరు అధికారులు, అర్చకులు, పరిచారకులు కాటేజీలను సొంతం చేసుకుని కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. దాతలు నిర్మించిన కాటేజీలను కొందరు నివాసంగా మార్చుకుని అటు దేవస్థానం ఆదాయానికి గండి కొడుతుండగా.. ఓ పరిచారకుడు తనకున్న పలుకుబడితో కాటేజీ పొంది అక్రమంగా ప్రైవేట్‌ వ్యాపారం నిర్వహిస్తుండటం గమనార్హం. సామాన్య భక్తులతో పాటు క్షేత్ర సందర్శనకు వచ్చే వీవీఐపీల కోసం దాతల సహకారంతో దేవస్థానం కాటేజీలను నిర్మించింది. నిర్మాణానికి ముందుకొచ్చే దాతలతో దేవస్థానం కొంత డబ్బును అడ్వాన్స్‌గా డిపాజిట్‌ కట్టించుకుని స్థలాన్ని కేటాయిస్తుంది. దేవస్థానం నియమ నిబంధనల మేరకు దాతలు నిర్మాణం పూర్తిచేసి దేవస్థానానికి అప్పగిస్తారు. ఈ కాటేజీలను దేవస్థానం భక్తులకు రోజు వారి అద్దె ప్రాతిపదికన అందిస్తుంది. కాటేజీ దాతలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచితంగా, దాతలు సిఫార్సు చేసిన వారికి సగం అద్దె తీసుకుంటారు. దాతలకు సంవత్సరంలో 30 రోజులు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తారు. కాగా దాతలు నిర్మించిన కాటేజీలను కొందరు నివాసంగా మార్చేసుకున్నారు.

ఈఓ భవనం పూర్తయినా ప్రారంభించరు..

శ్రీశైలాలయం కార్యనిర్వహణాధికారి భవనం, క్యాంప్‌ కార్యాలయానికి దేవస్థానం రూ.1.50 కోట్లతో అధునాతన హంగులతో భవనం నిర్మించారు. గణేశ సదనం పక్కన విశాలమైన ప్రదేశంలో ఈఓ భవనంతో పాటు, క్యాంప్‌ కార్యాలయం రూపుదిద్దుకుంది. నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. అయితే గత ఈఓలు కొద్దిపాటి మరమ్మతులు చేయాలని జాప్యం చేస్తూ ఇంత వరకు భవనాన్ని ప్రారంభించలేదు. భవన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. ఈఓకు గృహం ఉండాలి కాబట్టి దాతలు కట్టించిన ఓ ప్రైవేట్‌ కాటేజీలో నివాసం ఉంటున్నారు. గత ఈఓ ఉన్న కాటేజీకి వాస్తు బాగాలేదని, ప్రస్తుత ఈఓ తూర్పు ముఖద్వారం ఉన్న ఓ కాటేజీలో నివాసం ఉంటున్నారు.

మల్లన్న ఆదాయానికి రూ.కోట్లలో నష్టం

దేవస్థానంలో విధులు నిర్వహించే ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, మరో ఇద్దరు అర్చకులు, ఓ సహాయ వంట మనిషి సైతం కాటేజీలలో తిష్ట వేశారు. అసలే కాటేజీలు తక్కువగా ఉండడం, డిమాండ్‌ ఎక్కువ ఉండడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. కల్యాణకట్టకు ఎదురుగా ఉండే పాత కాటేజీల్లో అయితే చాలా మంది అధికారులు, సిబ్బంది పలువురు కాటేజీలలో నివాసం ఉంటున్నారు. గతంలో ఈఓలుగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు సైతం కల్యాణకట్టకు ఎదురుగా ఉన్న పాత కాటేజీలకు మరమ్మతులు చేయించుకుని నివాసం ఉండేవారు. ప్రస్తుతం దేవస్థాన ఉన్నతాధికారి నివాసం ఉండే కాటేజీకి రోజు వారీ అద్దె సుమారు రూ.10 వేలు ఉంటుంది. నెలకు రూ.3 లక్షలు, సంవత్సరానికి రూ.36 లక్షలు కేవలం ఉన్నతాధికారి కాటేజీ ద్వారా దేవస్థానానికి నష్టం చేకూరుతుంది. అలాగే ఈఈ కాటేజీ రూ.4వేలు, అర్చకులు ఉండే కాటేజీలకు రూ.2వేలు, సహాయ వంట మనిషి ఉండే కాటేజీకి రూ.2 వేలు రోజు వారీ అద్దె ఉంటుంది. ఇలా మల్లన్న ఆదాయానికి ఏటా ఎంత నష్టం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రారంభానికి

నోచుకోని

ఈఓ నూతన

భవనం

తాంత్రిక పూజల కలకలం

ఆలయంలో పని చేస్తున్న ఓ అర్చకుడు తాంత్రిక పూజలు చేయడం కలకలం రేపుతోంది. ఓ ఉన్నతాధికారితో సఖ్యతగా మెలుగుతున్న ఈయన అన్ని వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆలయ ముఖ్యుల్లో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇటీవల ఆయన మరొకరితో కలిసి తాంత్రిక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అర్చకుడు ఆలయంలో తన హవా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈయన తీరుతో మిగిలిన అర్చకులు సైతం మండిపడుతుండగా.. అధికారి ఆశీస్సులు ఉండటంతో ఏమీ చేయలేక లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీశైలంలో సొంతానికి కాటేజీలు

కాటేజీ పాతబడిందనే కారణం చూపి, తనకున్న పలుకుబడితో దేవస్థానంలో సహాయ వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్న ఓ రెగ్యులర్‌ ఉద్యోగి కాటేజీ పొందాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో ప్రైవేట్‌ వ్యాపారులకు తన కాటేజీని రెంట్‌కు ఇచ్చారు. తాను ఉంటూనే వ్యాపారులకు చెందిన వస్తువులు తన కాటేజీలో స్టోర్‌ చేసుకునేలా ఒప్పందం చేసుకొని నెలకు సుమారు రూ.50 వేలు అద్దె రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది. నిత్యం వీవీఐపీలు బస చేసే కాటేజీలకు సమీపంలోనే సహాయ వంట మనిషి కాటేజీ ఉన్నప్పటికీ ఎవరికీ భయపడకుండా, దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యాపారం నిర్వహిస్తుండటం గమనార్హం.

శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోసం నిర్మించిన భవనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. చిన్నపాటి మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి ఈఓలుగా పనిచేసిన వారు కాటేజీలనే క్యాంప్‌ కార్యాలయాలుగా చేసుకుని పరిపాలన సాగించారు. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతోంది.

– ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన

కార్యనిర్వహణాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement