డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తాం

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తామని ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. ఫ్యాప్టో చైర్మన్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల శ్రీనివాససెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు హృదయరాజు, సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సిన 11వ పీఆర్సీ, అరియర్స్‌, 2022 నుంచి రావాల్సిన సరెండర్‌ లీవ్‌, ఎన్‌క్యాష్‌మెంట్‌ 30 శాతం, ఐఆర్‌ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐదు డీఏలు, పాత బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎంఈఓ బదిలీలు, హెచ్‌ఎంల పరస్పర బదిలీలు, ఎంఈఓ–1, 2 జాబ్‌ చార్ట్‌లో అసమ్మతులను తొలగించాలని, ఎస్‌ఎస్‌ఏలో సెక్టోరల్‌ అధికారులు డీఐఈటీ సీనియర్‌ లెక్చరర్లుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించాలన్నారు. పంచాయతీ రాజ్‌ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు వరప్రసాద్‌, చంద్రశేఖర్‌, నగరి శ్రీనివాసులు, కిరణ్‌కుమార్‌రెడ్డి, స్వామిశేఖర్‌, కేవీ శివయ్య, లక్ష్మణ్‌నాయక్‌, రవికుమార్‌, అజాంబేగ్‌, సైఫుల్లా, సుధాకర్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement